భూపాలపల్లి గడ్డ.. ఎవరిదో అడ్డా..!

భూపాలపల్లి గడ్డ.. ఎవరిదో అడ్డా..!
  • ఈవీఎంలలో అభ్యర్థుల భవితవ్యం..
  • కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఉత్కంఠ పోటీ..
  • మూడో స్థానంలో నిలిచిపోనున్న బీజేపీ..?
  • పోలింగ్ సరళి పై అంచనాలు వేస్తున్న అభ్యర్థులు..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: భూపాలపల్లి నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికలు ఉత్కంఠ భరితంగా సాగాయి. ఎన్నికల ఫలితాలు వెలువడితే అభ్యర్థుల భవితవ్యం బయటపడనుంది. ఈ సారి ఇద్దరి మధ్య హోరాహోరీ జరుగగా భూపాలపల్లి గడ్డ.. ఎవరిదో ఈ అడ్డ అంటూ.. ఎన్నికల ఫలితాలపై ప్రజలు ఆసక్తి కనబరిచి ఎదురు చూస్తున్నారు. ఈవీఎంలలో ఎమ్మెల్యే అభ్యర్థుల భవితవ్యం భద్రంగా ఉండగా, ఈ నెల 3న వెలువడనున్న ఫలితాలతో ఎమ్మెల్యే ఎవరు అనేది తేలనుంది. భూపాలపల్లి నియోజకవర్గంలో ప్రధానంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావుల మధ్య ఉత్కంఠ భరితంగా ఎన్నికలు సాగినట్లు పోలింగ్ సరళిని బట్టి చూస్తే అవగతమవుతుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి చందుపట్ల కీర్తిరెడ్డి మూడో స్థానంలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. భూపాలపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా 23 మంది బరిలో ఉన్నప్పటికీ, అందులో ఇద్దరు ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య హోరాహోరీగా ఎన్నికల ప్రక్రియ కొనసాగింది.

గెలుపు పై ఎవరు లెక్కలు వారివే..
 భూపాలపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థులు లెక్కలు చేయడంలో నిమగ్నమయ్యారు. ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు పోలింగ్ సరళిని పరిశీలిస్తూ గెలుపు పై లెక్కలు వేసుకుంటున్నారు. నియోజకవర్గంలో మొత్తం 2,73,633 ఓటర్లకు గాను 2,24,432 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తంగా భూపాలపల్లిలో 82.02 శాతం పోలింగ్ జరిగినట్లు అధికార వర్గాలు తెలియజేశాయి. ఈ మేరకు నియోజకవర్గంలోని 317 పోలింగ్ కేంద్రాల్లో జరిగిన ఎన్నికల సరళిని ప్రధాన పార్టీల అభ్యర్థులు పరిశీలన చేస్తున్నారు. ఏ పోలింగ్ బూతులో ఎన్ని ఓట్లు పోలయ్యాయి. అందులో మైనస్ ఎన్ని, ప్లస్ ఎన్ని అని అంచనాలు వేస్తూ గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గెలుపు తనదంటే తనదేనని కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలకు సంకేతాలు ఇస్తూ సంబురాలకు సిద్ధం కావాలని సిగ్నల్ అందజేస్తున్నారు.

భూపాలపల్లి లో 15 వేలకు మించని మెజారిటీ..
 భూపాలపల్లి నియోజకవర్గంలో ఇప్పటివరకు 15 వేలకు మించి మెజారిటీ రాలేదు. భూపాలపల్లి నియోజకవర్గంగా ఏర్పడినప్పటి నుండి మూడుసార్లు ముగ్గురు మధ్య ఉత్కంఠ పోటీలు జరగగా, ఈసారి మాత్రం ఇద్దరి మధ్య ఉత్కంఠ పోటీ జరిగింది. ఈ నేపథ్యంలో మెజారిటీ తలకిందులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొట్టమొదటిసారిగా భూపాలపల్లి నియోజకవర్గంగా ఏర్పడగా, జనరల్ కు కేటాయించారు. పరకాల నియోజకవర్గం నుండి విడిపోయి నియోజకవర్గంగా ఏర్పడిన భూపాలపల్లిలో మొదటి సారిగా 2009లో జరిగిన ఎన్నికల్లో టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సిరికొండ మధుసూదనాచారి పై అప్పటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి 11,972 మెజారిటీతో గెలుపొందారు. 2014లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి పై టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సిరికొండ మధుసూదనాచారి 7,214 మెజార్టీతో గెలుపొందారు.

2018 లో అప్పటి ఏఐఎఫ్ బీ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావు పై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకట రమణారెడ్డి 15,635 మెజారిటీతో గెలుపొందారు. అయితే ఈసారి మాత్రం మెజారిటీ ఎక్కువగానే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో సిరికొండ మధుసూదనాచారి, గండ్ర సత్యనారాయణ రావు, గండ్ర వెంకటరమణారెడ్డి ముగ్గురి మధ్య గట్టి పోటీ ఉండేది. ముగ్గురిలో ఎవరికి 70 వేల ఓట్లకు అటు ఇటుగా వచ్చినా గెలుపు వరించేది. ఈసారి మాత్రం ఇద్దరి మధ్య గట్టి పోటీ ఉండడంతో సుమారు లక్ష ఓట్ల వరకు వచ్చినవారు విజయం సాధిస్తారని అంచనాలు వేస్తున్నారు. ఉత్కంఠ భరితంగా సాగిన ఎన్నికల్లో భూపాలపల్లి గడ్డపై విజయం ఎవరు సాధిస్తారు.. ఏ పార్టీ జెండా ఎగురుతుందోనని ఇప్పటికే ఈ ప్రాంత ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ నెల 3న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఈ ప్రాంత ప్రజలందరూ ఫలితాల రోజు కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.