భూపాలపల్లిని అన్ని విధాల అభివృద్ధి చేయడమే లక్ష్యం..

భూపాలపల్లిని అన్ని విధాల అభివృద్ధి చేయడమే లక్ష్యం..
  • పేదలందరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తా..
  • ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: భూపాలపల్లి నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడమే ప్రధాన లక్ష్యమని, పేదలందరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సెగ్గంపల్లి, చిట్యాల మండలంలోని చల్లగరిగ తదితర గ్రామాల్లో మంగళవారం నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో ఎమ్మెల్యే సత్యనారాయణ రావు పాల్గొని లబ్ధిదారులనుండి గ్యారంటీ పథకాల దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని నెరవేర్చేందుకు ముందుకు సాగుతుందన్నారు.

ఆరు గ్యారంటీల పథకంలో భాగంగా ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీని 10 లక్షల రూపాయలకు పెంచడం జరిగిందన్నారు. అదేవిధంగా మిగతా పథకాలను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన కార్యక్రమాన్ని ముందుకు తీసుకువచ్చిందన్నారు. ఈ మేరకు అధికారులు ప్రజల వద్దకు వెళ్లి గ్రామ గ్రామాన ఆరు గ్యారంటీల పథకం దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని చెప్పారు. ఈ పథకాలతో పేదలందరికీ తగు న్యాయం జరుగుతుందని తెలిపారు. రానున్న రోజుల్లో వికలాంగులకు రూ.6000 పింఛన్, మహిళలకు రూ.2500, రైతుబంధు రూ.15000 అందించడం జరుగుతుందన్నారు. వడ్ల కొనుగోళ్లలోనూ అవినీతిని అరికట్టి, రైతుల వద్ద ఎలాంటి దోపిడీ లేకుండా చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. ధరణిని రద్దుచేసి, భూమాత అందుబాటులోకి తేవడం జరుగుతుందని, అర్హులైన రైతులకు పట్టాలు అందజేసి, రైతుబంధు, రైతు భీమా వర్తించేలా కృషి చేస్తామన్నారు. ప్రభుత్వ దవఖానాల్లో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించి మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తానని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమాల్లో అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, జడ్పి సీఈవో విజయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ వెంకటరాణి, ఎంపీడీవో రామయ్య, ఎంపిపి దావు వినోద, సర్పంచ్ కర్రె మంజుల, నాయకులు కామిడి రత్నాకర్ రెడ్డి, గూట్ల తిరుపతి, ముకిరాల మధువంశీకృష్ణ, కర్రె అశోక్ రెడ్డి, నందికొండ రవీందర్ రెడ్డి, ఉపసర్పంచ్ సంగ గౌతమి తదితరులు పాల్గొన్నారు.