కరువు కోరల నుండి అన్నపూర్ణ తెలంగాణగా మార్పు..

కరువు కోరల నుండి అన్నపూర్ణ తెలంగాణగా మార్పు..
  • రైతుల సంక్షేమానికి పెద్దపీట వేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం.. 
  • ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: కరువుకోరల నుండి అన్నపూర్ణ తెలంగాణగా మార్పు తీసుకువచ్చి, రైతుల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని దూత్ పల్లి, లక్ష్మీపురంతండా, ఒడితల, పాశిగడ్డతండా, కొత్తపేట గ్రామాల్లో శనివారం ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణలో గతంలో ఉన్న పరిస్థితులను ఇప్పుడున్న పరిస్థితులను గుర్తు చేసుకోవాలని అన్నారు. విద్యుత్ సౌకర్యం సరిగా లేక నాడు రైతులు నానా ఇబ్బందులు పడ్డారని అన్నారు. పంటలకు సాగునీరు అందించలేక ముప్పు తిప్పలు పడిన పరిస్థితులు ఉండేదన్నారు. ప్రస్తుతం రైతులకు ఆ పరిస్థితి లేదన్నారు. కోతలు లేని విద్యుత్తును సరఫరా చేయడం, రైతులకు పెట్టుబడి సాయం కింద రైతుబంధు అందించడం మర్చిపోలేనివని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగిందన్నారు. దివ్యాంగులకు పింఛన్లు పెంచడం, పెళ్లి చేసుకున్న ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ అందించడం, విద్యా, వైద్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరిచి అభివృద్ధి చేయడం, సాగు, త్రాగునీటి సౌకర్యాలను మెరుగుపరచుకోవడం జరిగిందన్నారు. తెలంగాణలో అంచెలంచెలుగా అభివృద్ధి దిశగా పాలన సాగిందని, రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి జరగనుందని చెప్పారు. అందుకోసం బీఆర్ఎస్ ప్రత్యేక మేనిఫెస్టోను ప్రకటించడం జరిగిందని తెలియజేశారు. మాయ మాటలు చెప్పే వారిని నమ్మకూడదని, ప్రతి ఒక్కరు అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ కు ఓటు వేసి ఆశీర్వదించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దావు వినోద వీరారెడ్డి, జడ్పిటిసి గొర్రె సాగర్, పిఎసిఎస్ చైర్మన్ కుంభం క్రాంతికుమార్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.