మార్పుకే తీర్పు ఇచ్చిన భూపాలపల్లి ప్రజలు..

మార్పుకే తీర్పు ఇచ్చిన భూపాలపల్లి ప్రజలు..
  • భారీ మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావు గెలుపు..
  • గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సంబరాలు..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: భూపాలపల్లి నియోజకవర్గంలోని ప్రజలు మార్పుకే తీర్పు ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి షాక్ ఇచ్చి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావుకు పట్టం కట్టారు. భూపాలపల్లి నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయిన గండ్ర సత్యనారాయణ రావుకు భారీ మెజారిటీ ఇచ్చి ఈ ప్రాంత ప్రజలు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీగా ప్రచారం జరిగినప్పటికీ, ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ ఉంటుందని భావించినప్పటికీ, చివరికి ప్రజలు మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సత్యనారాయణ రావు వైపు మొగ్గు చూపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగిన ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

గతంలో వివిధ పార్టీల నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటికీ అతి తక్కువ ఓట్లతో గండ్ర సత్యనారాయణ రావు ఓటమిపాలయ్యారు. రెండుసార్లు ఓటమిపాలైనప్పటికీ మొక్కవోని ఆత్మవిశ్వాసంతో కాంగ్రెస్ పార్టీలో చేరి భూపాలపల్లి టికెట్ ను దక్కించుకున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగిన సత్యనారాయణరావు గత ఓటముల నుండి గుణపాఠం నేర్చుకొని, ఈసారి ఎన్నికల్లో పగడ్బందీగా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలని పార్టీ నాయకులు, కార్యకర్తల అండదండలతో విశ్రమంగా శ్రమించారు. నియోజకవర్గంలోని గణపురం మండలం బుద్ధారం గ్రామానికి చెందిన గండ్ర సత్యనారాయణ రావు సొంత మండలంలో జడ్పిటిసిగా పనిచేసిన అనంతరం ఎమ్మెల్యేగా బరిలోకి దిగి రెండుసార్లు ఓటమిపాలయ్యారు. గత 15 ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఎమ్మెల్యే పదవి ఈసారి ఆయనకు చేజిక్కింది. 

మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలుపు..
భూపాలపల్లి నియోజకవర్గంలో గండ్ర సత్యనారాయణ రావు మొదటిసారిగా ఇక్కడ ఎమ్మెల్యే గా గెలిచారు. ఆయన ఎన్నో ఏళ్ల కళ నేడు నెరవేరింది. అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డికి ఓట్ల లెక్కింపులో 70,256 ఓట్లు రాగా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావుకు 1,22,231 ఓట్లు వచ్చాయి. సమీప బీఆర్ఎస్ అభ్యర్థిపై 51,975 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర సత్యనారాయణరావు విజయం సాధించారు. నియోజకవర్గం ఏర్పడినప్పటి నుండి ఇప్పటివరకు ఈ ప్రాంత ప్రజలు మార్పుకే ముగ్గు చూపుతున్నారు. మొదటిసారి భూపాలపల్లి నియోజకవర్గంగా ఏర్పడినప్పుడు 2009లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసిన గండ్ర వెంకటరమణారెడ్డి ఎమ్మెల్యేగా గెల్పొందారు. 2014లో టిఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసిన సిరికొండ మధుసూదనాచారి గెలుపొందారు. 2018లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీచేసిన గండ్ర వెంకటరమణారెడ్డి గెలుపొందారు. ప్రస్తుత 2003 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసిన గండ్ర సత్యనారాయణ రావు విజయం సాధించారు.

కాంగ్రెస్ కు 51,975 ఓట్ల భారీ మెజారిటీ..
 భూపాలపల్లిలో కాంగ్రెస్ కు 51,975 ఓట్ల భారీ మెజారిటీ లభించింది. ఇప్పటివరకు ఇక్కడ ఇది రికార్డు. నియోజకవర్గంలో  గతంలో 15 వేలకు మించి మెజారిటీ రాలేదు. నియోజకవర్గంగా ఏర్పడినప్పటి నుండి మూడుసార్లు ముగ్గురు మధ్య ఉత్కంఠ పోటీలు జరగగా, ఈసారి మాత్రం ఇద్దరి మధ్య ఉత్కంఠ పోటీ జరిగింది. ఈ నేపథ్యంలో మెజారిటీ భారీగా వచ్చిచేరింది. మొట్టమొదటిసారిగా నియోజకవర్గంగా ఏర్పడగా, జనరల్ కు కేటాయించారు. పరకాల నియోజకవర్గం నుండి విడిపోయి నియోజకవర్గంగా ఏర్పడిన భూపాలపల్లిలో మొదటి సారిగా 2009లో జరిగిన ఎన్నికల్లో టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సిరికొండ మధుసూదనాచారి పై అప్పటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి 11,972 మెజారిటీతో గెలుపొందారు. 2014లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి పై టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సిరికొండ మధుసూదనాచారి 7,214 మెజార్టీతో గెలుపొందారు. 2018 లో అప్పటి ఏఐఎఫ్ బీ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావు పై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకట రమణారెడ్డి 15,635 మెజారిటీతో గెలుపొందారు. ఇదే పెద్ద మెజారిటీగా ఉన్న పరిస్థితులలో ఈసారి మాత్రం 51,975 ఓట్ల భారీ మెజారిటీ రావడం విశేషంగా చెప్పవచ్చు. అయితే గతంలో సిరికొండ మధుసూదనాచారి, గండ్ర సత్యనారాయణ రావు, గండ్ర వెంకటరమణారెడ్డి ముగ్గురి మధ్య గట్టి పోటీ ఉండేది. ముగ్గురిలో ఎవరికి 70 వేల ఓట్లకు అటు ఇటుగా వచ్చినా గెలుపు వరించేది. ఈసారి మాత్రం ఇద్దరి మధ్యే గట్టి పోటీ ఉండడంతో ఇరువురికీ ఓట్ల శాతం పెరిగింది. 

గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సంబురాలు..
 కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావు ఎమ్మెల్యేగా గెలుపొందడంతో నియోజకవర్గంలోని ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబురాలు జరుపుకున్నారు. మొదటి రౌండ్ నుండే కాంగ్రెస్ అభ్యర్థికి అంచలంచెలుగా మెజారిటీ పెరుగుతూ, చివరికి మొత్తం 23 రౌండ్ల లెక్కింపు వరకు భారీ మెజారిటీ రావడంతో పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ సంబురాల్లో మునిగితేలారు. గ్రామ ముఖ్య కూడళ్ల వద్ద బాణసంచాలు పేల్చి, స్వీట్లు పంచిపెడుతూ, శుభాకాంక్షలు చెప్పుకున్నారు.