దళిత రైతులపై అటవీ అధికారుల దౌర్జన్యం!

దళిత రైతులపై అటవీ అధికారుల దౌర్జన్యం!
  • పట్టా భూములలో చెట్లు నాటుతారా ? 

మహాదేవపూర్, ముద్ర: గత ప్రభుత్వం దళితులకు భూములు కేటాయించి పట్టాలిచ్చింది. అటవీ అధికారులు చెట్టు నాటుతున్నారు. ఇదెక్కడి న్యాయం ప్రభుత్వం ఇచ్చిన మా భూములను రక్షించాలని కోరుతూ దళితులు ధర్నాకు దిగారు. సూరారం శివారులోని సర్వే నెంబర్ 279 లో ఉన్న అరవై ఎకరాల భూమిని 120 మంది దళితులకు ప్రభుత్వం పట్టాలిచ్చింది. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఉన్న సమయంలో వీరు పట్టాలు పొందినట్టు దళితులు పేర్కొంటున్నారు. ఒక్కొక్క దళితునికి 18 గుంటల చొప్పున ఇట్టి భూమిని ప్రభుత్వం కేటాయించి పట్టాలివ్వటంతో వీరు సాగు చేసుకుంటున్నారు. ప్రస్తుతం అటవీ అధికారులు వచ్చి ఈ భూమి ప్రభుత్వానిదంటూ సాగు చేస్తున్న వారిపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని దళితులు ఆరోపిస్తున్నారు. దీంతో గ్రామస్తులంతా కలిసి మహాదేవపూర్ తహసిల్దార్ ముందు ధర్నా నిర్వహించి వినతి పత్రాన్ని సమర్పించారు. వినతి పత్రం సమర్పించిన వారిలో కొయ్యల మల్లయ్య, తూటిచర్ల దుర్గయ్య, జిల్లెల్ల నాగరాజు, తూటిచర్ల శేఖర్, కొయ్యల శ్రీనివాస్, మండపల్లి వెంకటస్వామి, కొయ్యల మహేష్, తూటిచర్ల లక్ష్మి, రజిత, శంకర్ తదితరులు ఉన్నారు.