మంత్రి నిరంజన్ రెడ్డి కాన్వాయ్ పై దాడి

మంత్రి నిరంజన్ రెడ్డి కాన్వాయ్ పై దాడి

 కాన్వాయ్ అద్దాలు ధ్వంసం
 ముద్ర ప్రతినిధి, వనపర్తి : వనపర్తి జిల్లా చిట్యాల వ్యవసాయ మార్కెట్లో ఆదివారం నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా బయటికి వెళ్తున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కాన్వాయ్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి, ఆయన కాన్వాయ అద్దాలను ధ్వంసం చేశారు. ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థి తుడి మెగా రెడ్డి ఆదిక్యం వహించడంతో కౌంటింగ్ కేంద్రం నుండి నిరంజన్ రెడ్డి ఇంటికి వెళ్తుండగా ఆయన కాన్వాయ్ పై దాడి చేశారు. కౌంటింగ్ కేంద్రం వెలుపలకు రాగానే కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున జెండాలు పట్టుకొని నినాదాలు చేస్తూ కాన్వాయ్ ని అడ్డుకున్నారు. అందులో నుంచి గుర్తుతెలియని వ్యక్తులు జండా కర్రలతో కాన్వాయ్ అద్దాలను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడే ఉన్న పోలీసులు వారిని అదుపు చేసి నిరంజన్ రెడ్డి ని అక్కడినుండి పంపించేశారు.

 దాడిని నిరసిస్తూ ధర్నా
 వనపర్తి జిల్లా చిట్యాల కౌంటింగ్ కేంద్రం వద్ద మంత్రి నిరంజన్ రెడ్డి వాహనంపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేయడాన్ని నిరసిస్తూ టిఆర్ఎస్ కార్యకర్తలు వనపర్తి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చివరస్తాలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ కార్యకర్తలు రౌడీల్ల వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దాడి చేసిన వారిని గుర్తించి వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు.