ఇందిరమ్మ రాజ్యం రావాలంటే కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టండి 

ఇందిరమ్మ రాజ్యం రావాలంటే కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టండి 
  • కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకపోతే...
  • కెసిఆర్ కుటుంబం బిక్షం ఎత్తుకునేది*
  • మరోసారి అధికారం ఇస్తే మనవడిని మంత్రిని చేస్తారు 
  • వనపర్తి ఎన్నికల సభలో పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి

ముద్ర ప్రతినిధి,  వనపర్తి:తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం ఏర్పాటుచేసిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం, ఇందిరమ్మ రాజ్యం స్థాపనకు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి అధికారం ఇవ్వాలని పిసిసి అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం వనపర్తి పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన ఎన్నికల సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ఏం చేసిందని కెసిఆర్ పదేపదే ప్రశ్నిస్తున్నారని, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోతే కెసిఆర్ కుటుంబం నాంపల్లి దర్గా వద్దనో, బిర్లా మందిర్ మెట్ల మీదను బిక్షం వెతుక్కునేదని ఆయన ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో యువతకు నిరుద్యోగులకు రైతులకు సకల జనులకు ఎంతో లాభం చేకూరుతుందని భావించామని,  ప్రజలు ఎవరికీ లబ్ధి జరగకపోగా కెసిఆర్ కుటుంబానికి మంత్రి పదవులు వచ్చాయని ఆయన అన్నారు.

మరోసారి అధికారం ఇస్తే మనవడిని కూడా కేసీఆర్ మంత్రిని చేస్తారని ఎద్దేవా చేశారు. వనపర్తికి ఎంతో చరిత్ర ఉన్నదని 1952లో నిజాం కు వ్యతిరేకంగా పోరాడి సురవరం ప్రతాపరెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారున్నారు. 59 లో రాజా రామేశ్వరరావు ప్రధానిని తీసుకుని వచ్చి వనపర్తి లో పాలిటెక్నిక్ కళాశాలను స్థాపించారని తెలిపారు. నాటినుండి నేటి వరకు వనపర్తిని అభివృద్ధి చేసిన నాయకులు మంచి పేరు ప్రఖ్యాతలుగాంచారని, మలిదశ తెలంగాణ ఉద్యమంలో చిన్నారెడ్డి కీలక పాత్ర పోషించారని, ఆయన అందరికీ ఆదర్శప్రాయుడని, తనకు పెద్దన్నలాంటివాడని రేవంత్ రెడ్డి అన్నారు. నిరంజన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా బాధ్యతలు స్వీకరించి భూ కబ్జాలకు పాల్పడుతూ వనపర్తిని రాష్ట్రవ్యాప్తంగా దిగజార్చారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించక ముందు ఆయన ఆస్తులు ఏంటి అని, నేడు ఎక్కడ చూసినా ఫార్మ్ హౌస్ లు, ఖరీదైన బంగ్లాలు ఉన్నాయన్నారు. భూ కబ్జాలతో పాటు దేవుని మాన్యాలను కూడా మింగాడని ఆయన ఆరోపించారు. సిరిసిల్ల సిద్దిపేట లకు నిధులు తరలిపోతుంటే వెనుకబడిన పాలమూరు జిల్లాకు నిధులు ఎందుకు తేలేదని, ఇక్కడి మంత్రులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల ముఖ్యమంత్రి ఆయన కుటుంబ సభ్యులకు కనకవర్షం కురిసిందని, ఆ ప్రాజెక్టు ఇప్పుడు కుప్పకూలిందని అన్నారు.

తెలంగాణ తెచ్చానని చెప్పుకున్న వారికి రెండుసార్లు అధికారం ఇచ్చారని, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఈసారి అధికారం ఇవ్వండి అని, పాలమూరు బిడ్డ నైన తనకు అవకాశం కల్పించండి అని రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రజలను అన్ని రకాల దోచుకున్న డి ఆర్ ఎస్ కు మరోసారి అధికారం ఇస్తే ప్రజల  కిడ్నీలు కూడా అమ్ముకుంటారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే  6 గ్యారంటీలు అమలు చేస్తామని,  కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో అమలు చేశామని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, 400 కే గ్యాస్ సిలిండర్, 4000 రూపాయల పింఛన్ ఇస్తామని అన్నారు. అనంతరం ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి, కర్ణాటక విద్యా శాఖ మంత్రి సుధాకర్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మల్లురవి, రాజేంద్ర ప్రసాద్ యాదవ్, చీర్ల చందర్, వంశీ  తదితరులు పాల్గొన్నారు.