సూర్యాపేటలో చేజేతులా ఓటమిని కొనితెచ్చుకున్న కాంగ్రెస్

సూర్యాపేటలో చేజేతులా ఓటమిని కొనితెచ్చుకున్న కాంగ్రెస్
  • పోల్ మేనేజ్ మెంట్ లో.విఫలం...కొంపముంచిన అతివిశ్వాసం... అగ్రనాయకులు
    ప్రచారలేమి

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: 'ఊరందరిదీ ఒక దారి ఉలిపికట్టెది మరోదారి' అని వెనుకటికో సామెత
ఉండేది. అలాంటి సామెత నేడు సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ కు చాలా చక్కగా సరిపోతుంది. సూర్యాపేటలో ఓడిపోయామని బాధపడాలో రాష్ట్రంలో గెలిచామని సంతోషపడాలో అర్థం కాని సంయుక్త పరిస్థితులు ప్రస్తుతం సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు నెలకొన్నాయి ఈసారి సూర్యాపేట అభ్యర్థి గెలిస్తే రాష్ట్రస్థాయిలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది కనుక మంచి పొజిషన్లో గెలిస్తే సూర్యాపేట అభ్యర్థి ఉండేవాడని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. చివరికి తాను తీసుకున్న గోతిలో తానే పడ్డట్టు సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అయిందని పలువురు కార్యకర్తలు నిట్టూరుస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం మొత్తం అధికార పార్టీ వ్యతిరేక గాలి వీచి కాంగ్రెస్ పార్టీ సునామీ సృష్టిస్తే సూర్యాపేటలో మాత్రం మొదట నీనే గెల్తుస్తా అని జబ్బలు చరిచి తర్వాత చతికిలపడింది. రివ్వుమంటూ ఆకాశానికి దూసుకెళ్లిన కాంగ్రెస్ పార్టీ  సొంతపార్టీ నాయకుల కారణంగానే దబుక్కున నేలమీదపడింది.

బిఆర్ఎస్ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను ఓటుగా మలుచుకుని అంతటా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే సూర్యాపేటలో చేజేతులా ఓటమిని కొని(కొనలేక) తెచ్చుకుందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీలోకి అప్పుడే వచ్చి టికెట్ తెచ్చుకున్నవారినుంచి
సీనియర్ల వరకు దాదాపుగా అందరూ బంపర్ మెజార్టీలతో గెలిస్తే సూర్యాపేట
నియోజకవర్గంలో మాత్రం వర్గపోరాటాలు, సమన్వయలోపం, కలహాలు,
ఆర్దికలేమి, విస్తృత ప్రచారలోపం, ముఖ్యనాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్
అభిమానుల నిరాశ, నిస్పృహలతో కొట్టుమిట్టాడి ఓటమిని మూటకట్టుకుంది.
తాము గెలవక ఎవరు గెలుస్తారు అనే ఒకరమైన అతివిశ్వాసం పార్టీని
కొంపముంచిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మొదటి నుంచి బాగానే ఉన్నా
చివరి ఎన్నికలకు ఇగ రెండు రోజులు ఉందనగా పార్టీ పరిస్థితి
తేలిపోయింది.ఎన్నికలు అంటేనే ఖర్చుతో కూడుకున్నవి. అలాంటిది రోజువారి
ప్రచారంకు పోయి వచ్చినవారికి కూడా ఖర్చులు ఇవ్వకుండా నాన్చారనే
గుసగుసలు వినిపించాయి. పొద్దంతా ప్రచారంలో కష్టపడి పొద్దుగూకాక రెడ్
హౌజ్ కు వచ్చినవారిని పలకరించి, ఊరడించి అంతో, ఎంతో సహాయం చేసే 
మనిషే అక్కడ కాస్తకూడా ఓదార్పునివ్వలేదని స్వంతపార్టీ ముఖ్యకార్యకర్తలే
ఆవేదనను పలుమార్లు వ్యక్తం చేశారని రాజకీయ వర్గాల బోగట్టా. 'ఏమిరా
కాట...అంటే ఎప్పటి ఆటే' అన్నట్టుగా సూర్యాపేట నియోజకవర్గంలోని మిగతా
ప్రత్యర్ధులు బి ఆర్ఎస్, బిజెపిలు పోల్ మేనేజ్ మెంట్ లో డబ్బు, మద్యం బారీగా
పంచుతుంటే కాంగ్రెస్ పార్టీ  మాత్రం మీనమేషాలు లెక్కించుకుంటూ ఇగో, అగో
అంటూ ఆశలు పెట్టి ఊరించి ఊరించి చివరకు ఆయా వార్డులలో, గ్రామాలలో
ఉన్న ఓటర్లకు సగం మందికి మాత్రమే చివరిరోజు ఏదో ఇవ్వలేదనుకుంటా
ఏదో నామమాత్రం డబ్బులను ఇచ్చారని పలువురు సొంతపార్టీ నాయకులు,
కార్యకర్తలే ఆరోపిస్తున్నారు.

కనీసం ప్రచార కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే మీడియాకు కూడా కనీసం ఎక్కడ ఏ కార్యక్రమం జరుగుతుందో అనే
సమాచారం లేకుండా చేశారని, మీడియాతో మాకేంపని అన్నట్టు వ్యవహరించారనే
వాదనలు ఉన్నాయి. అంతేగాకుండా నియోజకవర్గంలో మిగతా పార్టీలు
అగ్రనాయకులతో బహిరంగసభలు నిర్వహిస్తే కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులను
కూడా కలుపుకుపోలేదనే విమర్శలున్నాయి. అంతేగాకుండా అక్కడ కేంద్రీకృతమై
ఒకరిద్దరి వద్దనే అధికారాలుండడం, వారి వైఖరి పార్టీలోని నాయకులకు,
కార్యకర్తలకు నచ్చకపోవడం, వారిని ఎవరు కలిసినా సరేలే, చేద్దాం, చూద్దాం
అంటూ దాటవేతదోరణి ప్రదర్శించారు తప్పించి నిజంగా ఎవరికికూడా ఏవిధమైన
ఆర్ధికభరోసా అందలేదని పలువురు వాపోయారు. ఏతా వాతా తేలేదేమిటంటే
ప్రభుత్వ వ్యతిరేక గాలి బాగా వీస్తుంది, ప్రభుత్వ వ్యతిరేక ఓటు మాకే వస్తుంది,
స్థానికంగా ఇతర పార్టీ నాయకులు ఎవరూ తమకు పోటీ కారు, ఎవరికి ఏమి
ఇవ్వకున్నా, ఎవరిని కలువకున్నా తప్పకుండా చచ్చినట్టు కాంగ్రెస్ పార్టీకే
ఓటెయ్యాలి, అందుకోసం నాయకులు, కార్యకర్తలు, ఓటర్లను కూడా తాము
కలవాల్సిన, బతిమిలాడాల్సిన అవసరం లేదు అన్న ధోరణితో వ్యవహరించడం వలన కాంగ్రెస్ పార్టీ ఓటమి కావాల్సి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు
అంచనావేస్తున్నారు. అంతేగాకుండా గతంలో ఒకసారి అధికారం ఇస్తే అధికారం
చెలాయించిదేవరో ప్రజలు గ్రహించారని, పేరుకు మాత్రమే పెద్దాయన అని,
పెత్తనం మాత్రం మరోకరిదనే విమర్శలు కూడా వినిపించాయి. దీనికితోడు
గతంలో ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుల వైఖరి,
దౌర్జన్యాలు, ఆగడాలు, అక్రమాల వల్లనే ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారని
ప్రత్యర్ధిపార్టీల వారు ఇదే అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళడం, పార్టీ
తరపున పోటీలో ఉన్న అభ్యర్ధి ఆరోగ్యంపై ప్రత్యర్థులు విమర్శలు గుప్పించడం
వలన కూడా ఓటర్లు కాంగ్రెస్ అంటేనే ఒకరకమైన మానసిక ఆందోళనతో
సతమతమయ్యారని సమాచారం.

అంతేగాకుండా ఇటీవల పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డ నేతలను, వర్గాన్ని తమవైపు తిప్పుకోవడంలో ప్రస్తుతం పోటీ చేసినవారు. కనీస శ్రద్ద వహించలేదని, వారు వస్తే ఎంత రాకుంటే ఎంత అన్న ఒకరకమైన
ఆధిపత్యదోరణి, భావనతో ఉండడం వలన కూడా పార్టీకి కొంత నష్టం జరిగిందని
తెలిసింది. ఇతర వర్గం నుంచి పార్టీలోకి వచ్చినవారికి కూడా కనీసం ప్రాధాన్యత
ఇవ్వలేదని, ప్రచారానికి పిలిచే నాయకుడు కూడా లేకపోవడం వల్లనే తాము
మిన్నకుండా పోయామని పలువురు నాయకులు, పొద్దంతా కష్టించి చేతులు
కట్టుకుని కాంగ్రెస్ ఆఫీస్ ముందు నిల్చున్నా పలుకరించి ఏమి కావాలనే
నాయకులు కూడా లేరని పార్టీ అనుబంధ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.
కర్ణుడి చావుడికి వంద కారణాలు అన్నట్టు కాంగ్రెస్ ఓటమికి సూర్యాపేటలో
అంతర్గత కుమ్ములాటలు ఎక్కువయ్యాయని, ఎన్నికలకు రెండురోజుల ముందే
కొంత వివాదం జరిగిందని, డబ్బులుండి కూడా ఓటర్లకు ఇవ్వలేదని కొందరంటే,
డబ్బు సర్దుబాటు కాలేదని మరికొందరు అనడం గమనార్హం. ఏది ఏమైనా పార్టీ
గెలిచి ఉంటే ప్రభుత్వం వచ్చినందుకు సీనియర్ అయిన సూర్యాపేట అభ్యర్ధికి
మంచి స్థానమే దక్కేదని, దాంతో సూర్యాపేట మరింతగా అభివృద్ధి చెందేదని,
ఏది ఏమైనా కాంగ్రెస్పార్టీ ప్రభుత్వం వచ్చిందని, ఇక్కడ ఎంఎల్ఎ కూడా గెలిస్తే
సూర్యాపేటకు మేలుజరిగేదని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.