దళాలరుల చేతిలో మోసపోతున్న పత్తి రైతులు..

దళాలరుల చేతిలో మోసపోతున్న పత్తి రైతులు..
  • మద్దతు ధర కన్నా తక్కువ రేటుకు దళాలరులు కొనుగోలు.... 
  • నిబంధనల పేరుతో చేతులెత్తేస్తున్న సీసీఐ...

గొల్లపల్లి, ముద్ర:-జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలలో పత్తి రైతులు దగా పడుతున్నారు. దళారులు ఇష్టం వచ్చిన రేటుకు రైతులు నుంచి పత్తిని కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారు.దళారులతో కుమ్మక్కమైన వ్యవసాయ మార్కెట్ శాఖ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కొనుగోలు కేంద్రాలు పలురకాల నిబంధనలు విధించి రైతులను ఇబ్బందులు పేడుతున్నారు.  ఏదోఒక్క సాకుతో పత్తిని రైతుల నుంచి ఎక్కువగా సేకరించడంలేదు. ఇది దళారులకు కలిసివస్తోంది. సీజన్ ప్రారంభంలో మార్కెట్లో క్వింటాల్ పత్తికి కనీసం ఏడున్నర వేల నుంచి ఎనిమిది వేల ధర పలకగా ప్రస్తుతం దళారులు ఆరువేల ఆరువందల  నుంచి ఆరువేల ఎనిమిది వందల లోపు మాత్రమే ధర చెల్లిస్తున్నారు. కేంద్రప్రభుత్వం క్వింటాల్  పత్తికి ఏడు వేల ఇరవై మద్దతు ధర నిర్ణయించినప్పటికీ అంతకు తక్కువ ధరకే రైతుల నుంచి దళారులు పత్తిని సేకరిస్తున్నారు.

దీంతో రైతులు క్వింటాలకు రెండువందల నుండి నాలుగు వందలు వరకు పైగా నష్టపోతున్నారు. కనీసం పంది నుంచి పన్నెండు క్వింటాళ్ల పత్తి దిగుబడి అవుతుండగా మద్దతు ధరలభించని కారణంగా ఎకరాకు  మూడు వేల నుండి నాలుగు వేల మొత్తం రైతులు నష్టపోతున్నారు. ఇదిలా ఉండగా, వ్యవసాయ శాఖ అధికారులు రైతులు ఏ ఏ సర్వే నెంబర్లలో పత్తి పంటను పండిస్తున్నారనే విషయమై నివేదికలు రూపొందించకపోవడంతో పలువురు పత్తి పంట పండించిన రైతులకు నష్టం కలుగుతోంది. వ్యవసాయ శాఖ అధికారులు సూచించిన సర్వే నంబర్ల నుంచే పంట కొంటామని సీసీఐ అధికారులు చెబుతున్నారు. వ్యవసాయ శాఖ సర్వేలో పత్తి పంట ఉన్న కల్లంలోని పత్తి పంటనే తాము కొనుగోలు చేస్తామన్నారు. దీంతో సర్వే నెంబర్లు రాయని సీన్లకు రైతులకు నష్టం కలుగుతోంది. ఆధార్ కార్డు కేవైసీ ద్వారా లింకు చేసుకున్న రైతులకే బ్యాంక్ ఖాతాల్లో డబ్బులను జమ చేస్తున్నారు. అయితే చాలామంది రైతులు తప్పనిసరి పరిస్థితిలో గత్యంతరం లేక దళారులకు పత్తి విక్రయించాల్సి వస్తోంది.సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు చర్యలు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఖరీఫ్ సీజన్ పత్తి సేకరణ సీసీఐ ద్వారా నిర్వహిచాలని పత్తి రైతులు కోరుతున్నారు.