ఆర్య వైశ్య భవనం కాదు... సర్దార్ సత్రం

ఆర్య వైశ్య భవనం కాదు... సర్దార్ సత్రం
  • సర్దార్ సత్రంలో అక్రమ నిర్మాణాలఫై కలెక్టర్ కు ఫిర్యాదు
  • ప్రజల ఆస్థిని కాపాడాలని కోరిన కౌన్సిలర్  జయశ్రీ 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల : జగిత్యాల పట్టణంలోని ప్రభుత్వ సర్దార్ సత్రంలో అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని 35వ వార్డు కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. 1948 నుండి 1952 వరకు చందాలు పోగుచేసి 1952లో 30 గుంటల స్థలాన్ని కొనుగోలు చేసి ఆస్థలంలో భవనాన్ని నిర్మించిన అప్పటి జాతీయ నాయకులు సర్దార్ వల్లబాయ్ పటేల్ స్పూర్తితో " సర్దార్ సత్రం " గా పిలుస్తున్న ఈ సత్రానికి అనువంశిక దర్మకర్తలు ఎవరు లేరని, సత్రానికి దేవాదాయ శాఖ వారసత్వయేతర ట్రస్ట్ బోర్డులు నియమించారని, జగిత్యాల రెవెన్యూ రికార్డులలో 1966-67 జగిత్యాల పహాని రికార్డులలో సర్వేనెంబర్ 1/ఇ.లో సర్దార్ సత్రం అని ఉంది. కాగా 1970-71 పహని  రికార్డులలో 1990-91లో ఇదే సర్వే నెంబర్లు సర్దారు సత్రం అని ఉందని తెలిపారు. మున్సిపల్ రికార్డులలో సర్దారు సత్రం పేరుతో 2-6-34 నుండి 2-6-44 వరకు పది నెంబర్లు అసెస్మెంట్ రిజిస్టర్లో ఉందని,  2011-12  నుండి జగిత్యాల మున్సిపాలిటీకి బకాయి ఉన్నారని,  మున్సిపల్ అసెస్మెంట్ రికార్డులలో 2010 కి ముందు  సర్దారు సత్రం  ఉన్న పేరును ఏలాంటి ఆధారాలు లేకుండానే  ఆర్యవైశ్య భవనం 26-10-2010 రోజున అప్పటి మున్సిపల్ అధికారులు మార్పిడి చేసారన్నారు.

ఈ విషయంలో పలు అభ్యంతరాలు రావడంతో మున్సిపల్ కమీషనర్ మారుతీ ప్రసాద్ ప్రొసిడింగ్ A1/452/ 2016 తేదీ 9-12-2016 రోజున G.O.Ms.No. 303 ఉత్తర్వులు ఇస్తూ ఎక్కడ ఆర్యవైశ్య భవనంగా పేరు మార్పిడి చేయమని లేనందున ఆంధ్రప్రదేశ్ పురపాలక సంఘ చట్టం 1965, నిబంధనల ప్రకారం 2-6-34 నుండి 2-6-44 వరకు ఉన్నటు వంటి ఆస్తి యజమాని హక్కును రద్దు చేస్తూ తిరిగి " సర్దార్ సత్రం" గా పేరు మార్పిడి చేసారని తెలిపారు. సర్దార్ సత్రం అని రికార్డులలో ఉన్న ఎవరి అనుమతి లేకుండా అక్కడ ఉన్న సర్దార్ సత్రంను కూల్చి వేసినారని పేర్కొన్నారు. అక్టోబర్ 2022 లో ఆర్యవైశ్య సంఘ అద్యక్షుడు TS, BPASS ద్వారా నూతన నిర్మాణం సర్దార్ సత్రం ఆవరణలో నిర్మించడానికి దరఖాస్తు చేసుకోగా అప్పుడు ఉన్న కమీషనర్ గంగాధర్ పత్రలను పరిశీలించి ప్రోజెక్ట్ టైటిల్ ఆర్యవైశ్య సంఘం అని తెలిపే విధంగా యాజమాన్య హక్కు పత్రం సమర్పించలేదని, ప్రతిపాదిత స్థలం పురపాలక రికార్డులలో ఇంటి నెంబర్ 2-6-32 నుండి 2-6-44 వరకు సర్దార్ సత్రం ఉంది అని తిరస్కరించారు.

సైట్ ఇన్స్పెక్టర్ గా వ్యవహరించిన రెవెన్యూ అధికార సైతం ప్రతి పాదిత స్థలానికి సంబంధిచిన రిజిస్ట్రేషన్ పత్రాలు, లింక్ పత్రాలు సమర్పించలేదని, రెవెన్యూ రికార్డులలో ప్రభుత్వ భూమిగా పేర్కొన బడి ఉందని రిమార్కులలో పేర్కొన్నట్లు తెలిపారు. ప్రభుత్వ స్థలంగా సూచించినప్పటికీ కూడ ఇప్పుడు అక్కడ భవన నిర్మాణాలకు, దుకాణ నిర్మాణాలకు సంబంధించిన మెటీరియల్ తీసుకు వచ్చి పనులు ప్రరంబిస్తున్నారని, ఈ స్థలం అన్ని వర్గాలకు సంబంధించినందున ఒక వర్గం వారికి కాకుండా అన్ని వర్గాల వారికి అనుభవించే విదంగా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.