మండలంలో పాఠశాలలు ప్రారంభం...

మండలంలో పాఠశాలలు ప్రారంభం...

పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ సరఫరా చేస్తున్న అధికారులు...

ముద్ర, మల్యాల: వేసవి సెలవులు ముగియడంతో మండలంలో సోమవారం పాఠశాలలు ప్రారంభం అయ్యాయి. అన్ని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు ఓపెన్ చేయగ, మొదటి రోజు విద్యార్థులు దాదాపు పూర్తి స్థాయిలో హాజరయ్యారు. మొత్తం 48 రోజుల పాటు సెలవులు ఉండడంతో... ప్రారంభం రోజు ఉపాధ్యాయులు, సిబ్బంది ముందుగానే చేరుకొని పాఠశాలలను శుభ్రం చేయించారు. కాగా, ఆయా గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్ సరఫరా అవుతున్నట్లు ప్రధానోపాధ్యాయులు తెలిపారు. ఈ విద్యాసంవత్సరo విద్యార్థులకు నోట్ పుస్తకాలు కూడా ప్రభుత్వం అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే బడిబాట కార్యక్రమం ద్వారా కొత్త విద్యార్థుల సంఖ్య పెరిగిందని పలువురు ప్రధానోపాధ్యాయులు తెలిపారు.

ఇది ఇలా ఉండగా, మల్యాల కొత్తపేట ప్రాంతంలోని ప్రాథమిక పాఠశాలను మందు బాబులు అడ్డాగా చేసుకొని, సీసాలు అక్కడే పడేయడంతో పాటు, మత్తులో వాటిని పగులగొట్టి చిందరవందర చేశారు. అయితే విద్యార్థులు పాఠశాలకు చేరుకొకముందే సిబ్బంది వాటిని తొలగించి, నీటితో శుభ్రం చేశారు. పాఠశాల చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం కోసం కృషి చేయాలని ప్రధానోపాధ్యాయులు నగేష్ కోరగా, వార్డ్ సభ్యుడు మిట్టపల్లి దశరథo మాట్లాడుతూ సమస్యను ఉపసర్పంచ్ శ్రీనివాస్ సహకారంతో సర్పంచ్ మిట్టపల్లి సుదర్శన్ దృష్టికి తీసుకెళ్లి, నిధుల మంజూరుకు కృషి చేస్తానన్నారు.