రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు

రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు
  • మొన్న పోలీసుల పేరుతో ప్రజలకు బెదిరింపులు
  • నేడు ఏసీబీ అధికారులు అంటూ ప్రభుత్వ అధికారులకు బెదిరింపు కాల్స్
  • సిద్దిపేట జిల్లాలో అప్రమత్తమైన పోలీస్ శాఖ

ముద్ర ప్రతినిధి: సిద్దిపేట: సైబర్ నేరగాళ్లు సిద్దిపేట జిల్లాలో రెచ్చిపోతున్నారు.ఏసీబీ అధికారులమంటూ ప్రభుత్వ అధికారులకు ఫోన్లు చేసి డబ్బులు ఇవ్వమని బ్లాక్ మెయిల్ కు దిగారు. మొన్న పోలీసుల పేరిట ప్రజల్ని బెదిరింపులకు గురి చేస్తూ డబ్బులు వసూలు చేసిన సైబర్ నేరగాళ్లు ఏకంగా ఇప్పుడు ప్రభుత్వ అధికారులనే టార్గెట్ చేశారు.వరుస సంఘటనల నేపథ్యంలో సిద్దిపేట జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. గుర్తుతెలియని వ్యక్తులు చేసే ఫోన్ కాల్స్ కు బెదరవద్దని ధైర్యంగా తమకు వెంటనే సమాచారం ఇవ్వాలని ప్రజలకు అధికారులకు సూచించింది. అధికారులకు బెదిరింపు కాల్స్ వస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేసింది. సిద్దిపేట జిల్లాలో నిన్న,ఈరోజు కలసి ముగ్గురి జిల్లా అధికారులకు గుర్తుతెలియని అపరిచిత వ్యక్తి ఫోన్ చేసి ఏసీబీ హెడ్ ఆఫీస్ హైదరాబాదు నుండి సెల్ నెంబర్ 7619189985 ద్వారా మాట్లాడుతూ మీరు డబ్బులు తీసుకుంటున్నట్టు  మీపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. 

మీరు ఇతరులను డబ్బులు అడిగారని ఫిర్యాదులు వచ్చాయని,3 లక్షల రూపాయలు పంపిస్తే మీపై వచ్చిన ఆరోపణలలో విచారణ చేసి కొట్టివేస్తామని లేదంటే ఏసీబీ దాడులు చేస్తామని సైబర్ నేరగాళ్లు బెదిరించారు. సదరు ముగ్గురు అధికారులు అనుమానం వచ్చి జాతీయ సైబర్ సెల్ హెల్ప్ లైన్ నెంబర్  1930 ఫోన్ చేసి ఫిర్యాదు చేయడంతో ఈ  ఉదంతం వెలుగు చూసింది. పోలీసులకు తెలిసింది. ఇటువంటి సంఘటనలు సిద్దిపేట జిల్లాలో గతంలో కూడా జరిగాయి. పోలీసుల పేరుతో సైబర్ నేరగాళ్లు మీ సేవ కేంద్రాల నుంచి డబ్బులు వసూలు చేసుకున్నారు.  షేర్ చాట్ యాప్ ద్వారా కూడా పోలీసులపేరుతో బెదిరించి, జిల్లాలో ప్రజలను వేధించి డబ్బులు వసూలు చేసిన సంఘటనలు ఇటీవల జరిగాయి. ప్రతిరోజు జిల్లాలో రెండు మూడు సైబర్ క్రైమ్స్ జరుగుతూనే ఉన్నాయి. అమాయకులను నమ్మించి సైబర్ నేరగాళ్లు డబ్బులు వసూలు చేసుకుంటున్నారు. ఈ సంఘటనలు అన్నింటి నేపథ్యంలో సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేత  ఒక ప్రకటన విడుదల చేస్తూ సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు ప్రవక్తగా ఉండాలని కోరారు. జిల్లా,డివిజన్, మండల స్థాయి అధికారులు ఎవరూ కూడా అపరిచితుల నుండి ఫోన్ కాల్ వస్తే  నమ్మవద్దని సూచించారు. వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేయాలని, సైబర్ నేరగాళ్లకు డబ్బులు చెల్లించకూడదని కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. సైబర్ నేరగాళ్ల పర్ధం పట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు.