తెలంగాణ రైతులకు శుభవార్త చెప్పిన మంత్రి హరీష్ రావు

తెలంగాణ రైతులకు శుభవార్త చెప్పిన మంత్రి హరీష్ రావు
  • ఈ నెలాఖరి నుంచే రైతుబంధు నిధులు విడుదల 
  • అపర భగీరథుడు సీఎం కేసీఆర్
  • బెజ్జంకి లో జరిగిన గిరిజన దినోత్సవం లో పాల్గొన్న మంత్రి హరీష్ రావు

ముద్ర ప్రతినిధి,సిద్దిపేట:-పంట పెట్టుబడి సాయాన్ని రైతన్నలకు ఈ నెలాఖరు నుంచి అందిస్తామని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రకటించారు.సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో శనివారం రాత్రి జరిగిన రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన 'గిరిజన దినోత్సవం' లో మంత్రి హరీష్ రావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ రైతు బంధు పథకం ద్వారా ఇచ్చే నిధులను ఈ నెలాఖరు నుంచి రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామన్నారు. మృగశిర కార్తె వచ్చిన వర్షాలు ఇంకా పడలేదన్నారు. అయినప్పటికీ చెరువులు, కుంటల్లో సమృద్ధిగా నీరు నిలువ ఉండడానికి కారణం జిల్లాలో నిర్మించిన ప్రాజెక్టు లేనని హరీష్ రావు చెప్పారు. గతంలో రాష్ట్ర ముఖ్య మంత్రులుగా చంద్రబాబు, రోశయ్య, ఎన్టీఆర్,వైయస్ లాంటి ఉద్దండులు పనిచేసిన తెలంగాణకు దక్కిన ఫలమేమీ లేదన్నారు.

తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనలో అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు శాశ్వత రిజర్వాయర్లను నిర్మించి రైతుల సాగునీటి, ప్రజల తాగునీటి కష్టాలను తీర్చిన అపర భగీరథుడు కేసీఆర్ అని కొనియాడారు. ఉద్యోగం ఉన్నప్పటికీ తెలంగాణ కోసం రసమయి బాలకిషన్ పోరాడిన ఉద్యమకారుడని కొనియాడారు. రాష్ట్రంలో విద్య ,వైద్య రంగాలలో అభివృద్ధిని చేయడం వల్ల అద్భుత ఫలితాలు వస్తున్నాయని హరీష్ రావు తెలిపారు. మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ 9 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా తనను ఆదరించిన ప్రజల కోసం తన శాయశక్తుల  పనిచేస్తున్నానని చెప్పారు. 8 లక్షలకు ఎకరా చొప్పున ఉన్న భూమి నేడు బెజ్జంకిలో కోటి రూపాయలకు ఏగబాకిందని చెప్పారు. గ్రామాల్లో అభివృద్ధి సంక్షేమ పథకాలను కోట్లాది రూపాయలతో చేపట్టానని వివరించారు.జిల్లా పరిషత్ చైర్ పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఫిరంగి, బెజ్జంకి ఎంపీపీ, జడ్పిటిసిలు, సర్పంచ్ మంజుల శ్రీనివాస్,వివిధ గ్రామాల నేతలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ముందుగా బెజ్జంకి వీధులలో భారీ ఊరేగింపు నిర్వహించారు. మంత్రి  హరీష్ రావు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన వాళ్ళ అర్పించారు. సభలో మహిళా సంఘాల వారికి ఐదు కోట్ల విలువైన చెక్కును మంత్రి అందజేశారు