రాజు గారి(దే)ఛాంబర్

రాజు గారి(దే)ఛాంబర్
  • సి. కళ్యాణ్‌ ప్యానల్‌పై విజయం 

హోరా హోరీగా జరిగిన ఫిలిం ఛాంబర్‌ ఎన్నికల్లో దిల్‌రాజు ప్యానల్‌ సి. కళ్యాణ్‌ ప్యానల్‌ పై అంతిమ విజయం సాధించింది. తెలుగు ఫిలిం ఛాంబర్‌ అధ్యక్షుడిగా దిల్‌రాజును ఎన్నుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికల పోలింగ్ జరిగింది. టీపీసీసీ అధ్యక్ష బరిలో నిర్మాతలు సి. కల్యాణ్, దిల్ రాజు నిలిచారు. దీంతో హోరాహోరీగా ఓటింగ్ జరిగింది. మొత్తం 1,339 ఓట్లు నమోదయ్యాయి. ప్రొడ్యూసర్‌ సెక్టార్‌లో 1,600 ఓట్లకుగాను 891, స్టూడియో సెక్టార్‌లో 98 ఓట్లకుగాను 68, డిస్ట్రిబ్యూషన్‌ సెక్టార్‌ లో 597 గాను 380 ఓట్లు పోలయ్యాయి. గతంలో లేనివిధంగా ఈసారి రికార్డు స్థాయిలో ఓట్లు పోలైనట్లు ఎన్నికల అధికారి తెలిపారు. తెలుగు ఫిలిం ఛాంబర్‌ ప్రెసిడెంట్‌గా దిల్‌రాజు, వైస్‌ ప్రెసిడెంట్‌గా ముత్యాల రామదాసు, కార్యదర్శిగా దామోదర్‌ ప్రసాద్‌, ట్రెజరర్‌గా ప్రసన్నకుమార్‌ ఎన్నికయ్యారు. మొత్తం 48 ఓట్లలో దిల్‌రాజు 31 ఓట్లు కైవసం చేసుకున్నారు. ప్రొడ్యూసర్‌ సెక్టార్‌లోని మొత్తం 12 స్థానాల్లో ఏడింటిని దిల్‌రాజు ప్యానల్‌ కైవసం చేసుకుంది. డిస్ట్రిబ్యూషన్‌ సెక్టార్‌లో 2 ప్యానల్స్‌ నుంచి సీ.కళ్యాణ్, దిల్ రాజు సెంటర్ల నుంచి చెరో ఆరుగురు గెలుపొందారు. దిల్ రాజుతోపాటు ప్రసన్న కుమార్, వైవీ చౌదరి, అశోక్ కుమార్, పద్మిని, స్రవంతి రవికిషోర్, యలమంచలి రవిశంకర్, దామోదర ప్రసాద్, మోహన్ వడ్లపాటి గెలుపొందారు. స్టూడియో సెక్టార్‌లో గెలిచిన నలుగురిలో ముగ్గురు దిల్ రాజు ప్యానల్ నుంచి ఉన్నారు. 

  • ఫలితాలు టై కావడంతో..

 ఫైనల్ రిజల్ట్ అనుకున్న షెడ్యూల్ లో ప్రకటించలేదు. పదవుల విషయంలో ఇరు ప్యానెల్స్ పట్టుదలతో ఉండటంతో ఫలితాలు కాస్త ఆలస్యమయింది. దిల్ రాజ్ ప్యానెల్‌‌లో మొత్తం 24 మంది సభ్యులు గెలవగా.. సి.కళ్యాణ్ ప్యానెల్‌లో 20 మంది గెలిచారు. 25 ఓట్లతో మెజారిటీ సాధించినవారికే ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్ష పదవి దక్కుతుంది. సీనియర్లు ముందుకు రాకపోవడంతో బరిలోకి... తాను దిగాల్సి వచ్చిందని దిల్ రాజు చెప్పారు. సీనియర్ నిర్మాతలు ఎవరూ ముందుకు రాకపోవడంతోనే ఛాంబర్  అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్లు 'దిల్' రాజు  ఎన్నికలకు ముందు ప్రకటించారు. ‘‘ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా తాను ఎన్నికైతే కిరీటం పెట్టరని, పైగా తనకు ఇంకా సమస్యలు పెరుగుతాయని ఈ సందర్భంగా అన్నారు. అయితే, పరిశ్రమ అభివృద్ధి కోసం తాను ఎన్నికల్లో పోటీ చేయక తప్పడం లేదన్నారు. తమ ప్యానల్ యాక్టివ్ ప్యానల్ అని 'దిల్' రాజు తెలిపారు. చిత్రసీమలో రెగ్యులర్ గా సినిమాలు నిర్మించే వారందరూ తమ ప్యానల్ లో ఉన్నారని చెప్పారు. వాణిజ్య మండలిని బలోపేతం చేసేందుకు తాము ముందుకు వచ్చినట్లు ఆయన తెలిపారు. ఇండస్ట్రీలో కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించడానికి సరైన టీమ్ కావాలని, అందుకు తాము ముందుకు వచ్చామని చెప్పారు. 

  • ఓటు హక్కు ఉన్న నిర్మాతలు 1560.. సినిమాలు తీసేది 200 మందే!

ఛాంబర్ ఎన్నికల్లో అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని 'దిల్' రాజు విజ్ఞప్తి చేశారు. ఓటు హక్కు ఉన్న నిర్మాతలు 1,560 మంది ఉన్నారని, అందులో రెగ్యులర్ గా సినిమాలు తీసేది 200 మంది మాత్రమేనని ఆయన తెలిపారు. తాము ఎవరినీ కించపరచడం లేదని, చిత్రసీమ బలోపేతం కావాలంటే అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన తెలిపారు.