చత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్.. 18 మంది మావోయిస్టుల మృతి

చత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్.. 18 మంది మావోయిస్టుల మృతి
  • నక్సల్ నాయకుడు శంకరరావు హతం

ఛత్తీస్ గఢ్: ఛత్తీస్ గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లా కల్పర్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య మంగళవారం భీకర పోరు సాగింది. ఈ ఎదురుకాల్పులలో ప్రముఖ నక్సల్ నాయకుడు శంకరరావు సహా, 18 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు సమాచారం. భద్రతా బలగాలు సంఘటనా స్థలం నుంచి పెద్దస్థాయిలో మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఎన్ కౌంటర్ లో ఒక ఇన్ స్పెక్టర్ సహా ముగ్గురు బీఎస్ఎఫ్ జవాన్లకు గాయాలయ్యాయని సమాచారం. సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్), డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్జీ) సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. నక్సల్ నాయకుడు శంకరరావుపై 25 లక్షల రూపాయల రివార్డు ఉంది.   మొత్తం 18 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. సంఘటనా స్థలంలొ ఏకే 47 రైఫిల్స్, మూడు లైట్ వెయిట్ మెషిన్ గన్స్ సహా భారీస్థాయిలో ఆయుధాలు పోలీసులకు లభ్యమయ్యాయి.  ఎన్నికలకు కేవలం కొద్ది రోజుల ముందే ఈ భారీ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది.