ధాన్యం కొనుగోలుకు అంతారెడీ

ధాన్యం కొనుగోలుకు అంతారెడీ
  • జిల్లాలో 171 ఏర్పాటు
  • జనగామ కలెక్టర్‌‌ శివలింగయ్య

ముద్ర ప్రతినిధి, జనగామ: జనగామ జిల్లాలో ఈ వానాకాలం వడ్లను కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు కలెక్టర్‌‌ సి.హెచ్‌ శివలింగయ్య తెలిపారు. ఐకేపీ ఆధ్వర్యంలో 79, పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో 92 మొత్తం 171 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. బుధవారం కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్‌తో కలిసి ఆయన సంబంధిత సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వానాకాలం- 2023–-24 సీజన్‌లో వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం జిల్లాలో 2.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందన్నారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

నాణ్యత ప్రమాణాలు పరిశీలించిన తర్వాత రైతులకు టోకెన్లు ఇవ్వడం జరుగుతుందని, దాని ప్రకారమే కొనుగోళ్లు నిర్వహించాలని, గన్ని సంచులు అందుబాటులో ఉంచుకోవాలని, అనువైన ప్రదేశాన్ని కొనుగోలు కేంద్రాలకు ఎంపిక చేసుకోవాలని, కొనుగోలు కేంద్రంలో మౌలిక వసతులైన టాయిలెట్లు, తాగునీరు, విద్యుత్, కావాల్సిన ఐరిష్, ఎలక్ట్రానిక్ యంత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. కొనుగోలుకు సంబంధించి కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్, హెల్ప్ లైన్ నంబర్(63039 28718)ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. సమావేశంలో డీఆర్డీవో మొగులప్ప, డీఎస్‌వో రోజారాణి, డీఎం ప్రసాద్, డీఎంవో నరేందర్ రెడ్డి, ఏపీడీ నూరుద్దీన్, రైస్ మిల్లర్లు, మహిళా సంఘాల ప్రతినిధులు, డీపీఎంలు పాల్గొన్నారు.