వృద్ధులకు ఉచిత వైద్య శిబిరం
ముద్ర ప్రతినిధి, నిర్మల్:స్థానిక దేవిబాయి క్రిటికల్ కేర్ ఆసుపత్రి, శాస్త్రి నగర్ ఆధ్వర్యంలో వృద్ధులు, రిటైర్డ్ ఉద్యోగులకు ఉచిత వైద్య శిబిరం ఆదివారం నిర్వహించారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఈ వైద్య శిబిరం మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగింది. ఈ శిబిరంలో దాదాపు 200 మందికి పైగా వృద్ధులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ప్రత్యేక పరీక్షలు సైతం ఉచితంగా నిర్వహించారు.
ఈ శిబిరంలో రక్తపోటు, మధుమేహం, గుండె సంబంధ సమస్యలు, కీళ్ల సంబంధ సమస్యలు, కంటి సమస్యలు, చర్మ వ్యాధులు, స్త్రీ సంబంధ వ్యాధులు, ఫిజియోథెరపీ విభాగాల్లో చికిత్స అందజేశారు. ఉచిత వైద్యం అందించిన వారిలో వైద్య నిపుణులు అవినాష్, రామచంద్రా రెడ్డి, రనీత్ కుమార్, ప్రశాంత్, అమరేశ్వర్, నర్సింహా రెడ్డి, శ్రీనివాస్,చంద్రిక, శృతి, కీర్తి ఉన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు డాక్టర్ అవినాష్ మాట్లాడుతూ నిర్మల్ ప్రాంత ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సౌకర్యాలు, 24 గంటల పాటు లభించేలా అత్యవసర వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి వైద్య సేవలు అందించనున్నట్లు వివరించారు.