ముక్కోటి ఏకాదశి వైభవం

ముక్కోటి ఏకాదశి వైభవం
  • కోదండ రామాలయం, వెంకటేశ్వర ఆలయంలో  వైకుంఠ ద్వార దర్శనం
  • పాల్గొన్న ఎమ్మెల్సీ శేరి, మాజీ ఎమ్మెల్యే పద్మ
  • పోటెత్తిన భక్తులు

ముద్ర ప్రతినిధి, మెదక్: ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు జిల్లా కేంద్రంలోని శ్రీ కోదండ రామాలయం, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో వైభవంగా నిర్వహించారు. శనివారం తెల్లవాజామున స్వామివార్ల ఉత్తర. ద్వార ప్రవేశం అనంతరం భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. రెండు దేవాలయాల్లో జరిగిన ఉత్సవాల్లో ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి లక్ష్మి దంపతులు, మాజీ ఎమ్మెల్యే ఎం.పద్మ దేవేందర్ రెడ్డి, జెడ్పి ఉపాధ్యక్షురాలు లావణ్య రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్, వైస్ చైర్మన్ ఆరెళ్ల మల్లికార్జున్ గౌడ్, గాయత్రి దంపతులు, మున్సిపల్ కౌన్సిలర్లు ఆరెళ్ల గాయత్రీ, రాగి వనజ అశోక్, మేడి కళ్యాణి మధుసూదన్ రావు, గడ్డమీది కృష్ణా గౌడ్, ఏడుపాయల దేవస్థానం డైరెక్టర్ రాగి చక్రపాణి భాగ్యలక్ష్మిలు పల్లకి సేవ, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.  శ్రీ కోదండ రామాలయంలో ప్రాతఃకాలంలో శ్రీ సీతారాములస్వాములవారి మూలవిరాట్టులకు మహా క్షీరాభిషేకాలు, నివేదన, మంత్ర పుష్పం, తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వైకుంఠద్వారం వద్ద పుష్పవేదికపై ఆసీనులై ఉన్న  స్వాములకు ప్రత్యేక పూజలు, సహస్రనామార్చనలు, నివేదనలు, సప్తహారతుల సమర్పణ, మంత్రపుష్పం, అనంతరం వేదఘోష, మహదాశీర్వచనం చేశారు. ప్రధాన అర్చకులు శ్రీభాష్యం మధుసూదనాచారి ఆధ్వర్యంలో  అర్చకులు శుక్లా, వైద్య శ్రీనివాస్, శ్రీవాండ్ల కృష్ణమూర్తి, భాను, శేషాచారిలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు బండ నరేందర్, కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో భక్తులకు ఏర్పాట్లు చేసి, ప్రసాదాలు అందజేశారు. మరోవైపు శ్రీ వెనకటేశ్వరస్వామి ఆలయంలో ఆలయ కమిటీ అధ్యక్షులు కంచి మధుసూదన్ ఆధ్వర్యంలో ఉత్సవాలు జరిగాయి. స్వామివారి పూజల్లో ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి తదితరులు స్వామిని దర్శించుకున్నారు. 

భక్తులు ఎటువంటి అసౌకర్యానికి గురికాకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ఆలయాల వద్ద భక్తులకు ఇబ్బందులు కలగకుండా మెదక్ పట్టణ పోలీసులు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. రోడ్డుపై బ్యారికేడ్లు  ఏర్పాటు చేసి భక్తులను క్రమబద్ధీకరించారు. వాహనాలకు అంతరాయం కలగకుండా ఏర్పాటు చేశారు. మహిళా భక్తులను దృష్టిలో ఉంచుకొని మహిళా కానిస్టేబుళ్లను నియమించారు.