సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తున్నాం

సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తున్నాం
  • మరో యూనియన్ తో పొత్తు అనేది అవాస్తవం..
  • ఐ ఎన్ టి యు సి జనరల్ సెక్రటరీ జనక్ ప్రసాద్ స్పష్టం

ముద్ర ప్రతినిధి పెద్దపల్లి: ఈనెల 27వ తేదీన సింగరేణిలో జరగబోయే గుర్తింపు సంఘం ఎన్నికలలో తమ యూనియన్ మొదటినుండి చెబుతున్నట్లుగానే ఒంటరిగానే  పోటీ చేస్తుందని, మరో యూనియన్ తో పొత్తు పెట్టుకునే అవసరం మాకు లేదని, అలాంటి ప్రచారం ఎవరు నమ్మకూడదని ఐ ఎన్ టి యు సి జనరల్ సెక్రటరీ  జనక్ ప్రసాద్ స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ముద్ర దినపత్రిక ప్రతినిధితో మాట్లాడారు. సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అనుబంధ టీబీజీకేఎస్ యూనియన్ ను ఢీకొనడానికి కాంగ్రెస్ పార్టీ అనుబంధ ఐ ఎన్ టి యు సి యూనియన్ ఏఐటీయూసీ యూనియన్ తో పొత్తు కుదుర్చుకున్నట్లు సామాజిక మాధ్యమాలలో వస్తున్న ప్రచారం సత్య దూరమని ఆయన స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో ఐ ఎన్ టి యు సి గడియారం గుర్తుపై పోటీ చేస్తుందని, కార్మికుల మద్దతు కూడా గట్టుకొని తప్పకుండా గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఐ ఎన్ టి యు సి మేనిఫెస్టోలోని ప్రతి అంశం ను తప్పకుండా అమలు చేయిస్తామని, యూనియన్ గెలిచిన వెంటనే కార్మికులకు సొంత ఇంటి పథకం, పెర్క్స్ పై ఆదాయపు పన్ను కోల్ ఇండియాలో మాదిరిగా ఇక్కడ కూడా సింగరేణి యాజమాన్యం చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామని, సింగరేణి వ్యాప్తంగా  ఏరియా ఆసుపత్రులను ఆధునికరించి కార్మిక కుటుంబాలకు మెరుగైన వైద్యం అందజేస్తామని ఆయన తెలిపారు. ఏఐటీయూసీతో పొత్తు కుదుర్చుకునే అవసరం తమకు లేదని జనక్ ప్రసాద్ స్పష్టం చేశారు.