మెడికల్ కాలేజీ తరలిస్తే ఊరుకోం..

మెడికల్ కాలేజీ తరలిస్తే ఊరుకోం..
  • మార్చి ఒకటి లోపు ప్రకటన రాకపోతే..రిలే నిరాహార దీక్ష చేస్తా: మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత

యాదగిరిగుట్ట, ముద్ర :యాదగిరిగుట్టకు మంజూరైన మెడికల్ కాలేజ్ ని కొడంగల్ నియోజకవర్గానికి తరలిస్తే ఊరుకునేది లేదని ఆలేరు మాజీ శాసన సభ్యురాలు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గురువారం యాదగిరిగుట్ట పట్టణంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల  సమావేశంలో ఆమె మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో ప్రతి మూల అభివృద్ధి చేయాలని సంకల్పించారని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి 55ఏళ్ల కాంగ్రెస్, టీడీపీ ల పరిపాలనలో ఒక్క రూపాయి ఇవ్వలేదని ఆరోపించారు. యాదగిరిగుట్ట దేవస్థాన అభివృద్ధి కోసం కేసీఆర్ ప్రభుత్వం 1250 కోట్లు కేటాయించి ఈతరంలో అద్బుతమైన దేవాలయాన్ని పునః నిర్మాణం చేశారని కితాబిచ్చారు. ప్రపంచ స్థాయిలో గ్రీన్ ఆఫీల్ అవార్డు సైతం‌ సొంతం చేసుకున్నట్లు వివరించారు.  దేశంలో ఒక్క తెలంగాణ రాష్ట్రానికి ఐదు అవార్టులు రావడం ఆయన పరిపాలనా దక్షతకు నిదర్శనం అని అన్నారు. ప్రపంచ ఖ్యాతి అబ్బురపడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని చెప్పారు. ప్రాంత అభివృద్ధి కోసం కేసీఆర్  ప్రభుత్వంలో వైద్య‌ కళాశాల మంజూరు చేయించామని గుర్తు చేశారు. బీబీనగర్ లో ఎయిమ్స్ ఉన్నప్పటికి యాదగిరిగుట్టలో మెడికల్ కళాశాలను తీసుకువచ్చామని తెలిపారు. యాదాద్రి దేవాలయానికి వచ్చి, వెళ్లె భక్తుల సౌకర్యార్ధం 100పడకల ఆస్పత్రిని 2022 నవంబర్ 29లో శంకుస్థాపన చేశామని అన్నారు  యాదాద్రీశుడి పేరుపై వైద్య కళాశాల ఆ వెంటనే జీవో నంబర్ 85తో 5జూలై 2023లో మంజూరీ‌ చేయించి, శంకుస్థాపన చేయాలని అనుకున్నప్పటికి స్థలం లేక శంకుస్థాపన‌ చేయలేదని చెప్పారు.

సర్వే నంబర్ 64ను గుర్తించి అక్కడ నిర్మాణం చేయాలని అనుకున్నామని తెలిపారు. 20ఎకరాలు మెడికల్ కళాశాలకు అప్పటి కలెక్టర్ పచ్చ జెండా ఊపినట్లు వివరించారు.సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ మెడికల్ కళాశాల కావాలంటే పారదర్శకంగా నిధులు కేటాయించి, కళాశాల మంజూరు చేయాలి కానీ కొడంగల్ వైద్య కళాశాల కోసం యాదాద్రికి కేటాయించిన దానిని ఎలా తీసుకెళ్తారని నిలదీశారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు మంజూరైనా కళాశాలను జీవోలను ఉల్లంగించి తీసుకెళ్తె ఊరుకునేది లేదని హెచ్చరించారు.

ప్రభుత్వం మీదే కాబట్టి ఇక్కడ మంజూరైనా వైద్య కళాశాలను తీసుకు వెళ్లకుండా స్థానిక ఎమ్మెల్యే, మంత్రులు కృషి చేయాలని డిమాండ్ చేశారు. మెడికల్ కళాశాలకు 300పడకల ఆస్పత్రి ఖచ్చితంగా ఉంటుందని అన్నారు.దూరదృష్టితోనే సర్వే నంబర్ 64లో మెడికల్ కళాశాల కోసం స్థలం చూశామని 20ఎకరాలు సరిపోకపోతే మిగిలిన స్థలంలో నిర్మాణం చేసుకోవచ్చని ఆలోచించామని తెలిపారు. ఫిబ్రవరి చివరి వరకు అనుకూలమైనా నిర్ణయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు.

జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు సీఎం దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.త్వరితగతిన 100పడకల ఆస్పత్రి, వైద్య కళాశాలను నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు.మార్చి1వ తేదీ వరకు వైద్య కళాశాల ఉంటుందని ప్రకటించకుంటే స్వయంగా రిలే నిరహార దీక్ష చేస్తామని ఈ సందర్భంగా ఆమె ప్రభుత్వాన్ని హెచ్చరించారు. యాదాద్రి భువనగిరి ప్రాంతం మీద ప్రేమ, చిత్త శుద్ది ఉంటే వైద్య కళాశాల ఉండాలని కాంగ్రెస్ నాయకులు సైతం పట్టుపట్టాలని పిలుపునిచ్చారు.ఇక్కడ వైద్య కళాశాల ఉంటే వేల ఉద్యోగాలు ఉండటంతో పాటు వేల ప్రాణాలు కాపాడొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. మానవత్వం ఉన్న ఆలోచన ప్రతి ఒక్కరు చేయాలని కోరారు. 1వ తేదీన నిర్ణయం తీసుకొని కార్యచరణ చేపడతామని ప్రకటించారు, ఈ సమావేశంలో బిఆర్ఎస్ నాయకులు కర్రె వెంకటయ్య, సుధగాని హరి శంకర్ గౌడ్, పల్లెపాటి సత్యనారాయణ, వస్పరి శంకరయ్య పాల్గొన్నారు.