మత్స్యకారుకు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా ప్రభుత్వం అడుగులు

మత్స్యకారుకు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా ప్రభుత్వం అడుగులు
  • రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనవాస యాదవ్ 

ఇబ్రహీంపట్నం, ముద్ర: మత్స్యకారులు ఆర్ధిక స్వావలంబన సాధించే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకారాన్ని అందిస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని శేరిగూడలో రూ. 2 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఫిష్ మార్కెట్ నిర్మాణ పనులను ఆయన స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. సీతారాం పేట్ లో 2,500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గొడౌన్ ను ప్రారంభించి, హరితహారంలో భాగంగా ఇబ్రహీంపట్నంలోని జేబీ వెంచర్ లో మొక్కలను నాటారు. సాగర్ రోడ్డు నుండి ఉప్పరిగూడ గ్రామానికి రోడ్డును ప్రారంభించారు. అనంతరం ఇబ్రహీంపట్నం లోని పెద్ద చెరువులో చేప, రొయ్య పిల్లలను విడుదల చేసి, మత్స్యకారులతో ఏర్పాటు చేసిన సభలో పాల్గొని మత్స్యకారులకు సభ్యత్వ కార్డులను పంపిణీ చేశారు.

ఈ సంధర్బంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో మత్స్యకారులు పూర్తిగా నిరాధరణకు గురయ్యారని విమర్శించారు. పూడిపోయి, పిచ్చిమొక్కలతో నిండిన చెరువులను స్వరాష్ట్రంలో మిషన్ కాకతీయ ద్వారా పునరుద్ధరించుకున్నామని చెప్పారు. నూతన రిజర్వాయర్‌ల నిర్మాణంతో నిరంతరం చెరువులు, కుంటలు నీటితో కళకళలాడుతున్న విషయాన్ని గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం మత్స్యకారులు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో దేశంలో ఎక్కడా లేనివిధంగా ఉచితంగా చేప పిల్లల పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. మత్స్యకారులకు సబ్సిడీపై వివిధ రకాల వాహనాలు అందజేసిన విషయాన్ని గుర్తుచేశారు.

అదేవిధంగా మత్స్యకారులు చేపలను అమ్ముకునేందుకు మార్కెట్లను నిర్మిస్తున్నట్లు చెప్పారు. మత్స్యకారులకు ఆదాయ మార్గాలను పెంచాలనే ఆలోచనతో మహిళా మత్స్యకారులకు చేపల వంటకాలపై ఉచితంగా శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలతో రాష్ట్రంలో మత్స్య సంపద భారీ ఎత్తున పెరిగిందని, ప్రభుత్వ ఫలాలు అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.

అందుకోసం నూతనంగా లక్ష మంది మత్స్యకారులకు సోసైటీల్లో సభ్యత్వాన్ని కల్పిస్తున్నట్లు చెప్పారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలనేది కేసీఆర్‌ లక్ష్యమని పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారని, మరో మారు ప్రభుత్వానికి అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వెంకటరమణారెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ సత్తయ్య,  మార్కెట్ కమిటీ చైర్మన్ చంద్రయ్య, ఎంపీపీ కృపేష్, మున్సిపల్ చైర్ పర్సన్ స్రవంతి, వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, సర్పంచ్ బూడిద రాంరెడ్డి, మత్స్య శాఖ అధికారులు, బీఆర్ఎస్ నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, వంగెటి లక్ష్మారెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.