అంతర్ రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్

అంతర్ రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్

ముద్ర ప్రతినిధి, నిర్మల్:నిర్మల్ జిల్లా కొండాపూర్ సమీపంలో మూడు వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుండి నిర్మల్ వైపు వస్తున్న ఈ వాహనాల్లో 24.8 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లుఎస్పీ డా.జి.జానకి షర్మిల తెలిపారు. దీని విలువ రూ.6.20 లక్షలు ఉంటుందని వివరించారు.  మెదక్ జిల్లాకు చెందిన మెగావత్ రాజు, మహారాష్ట్రలోని నాసిక్ కు చెందిన షేక్ ఇమ్రాన్, షేక్ సాదిక్, ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ కు చెందిన మహమ్మద్ ఇలియాస్, పందేనా నిఖిల్, ఒడిశా కు చెందిన ప్రఫూర్ కుమార్ ఖిల్లా, మహారాష్ట్ర లోని జాల్నా కు చెందిన భావులాల్ దేవ్ చాంద్ జార్డే లు ఒక ముఠాగా ఏర్పడి ఒడిశాలో గంజాయి కొనుగోలు చేశారని ఎస్పి తెలిపారు. రూ.3వేలకు కిలో చొప్పున 50 వేల గంజాయిని కొనుగోలు చేశారని పేర్కొన్నారు. ఈ గంజాయిని తెలంగాణాలోని ఆర్మూర్, నిర్మల్, హైదరాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్ తదితర ప్రాంతాల్లో కేజీ రూ. 25 వేల చొప్పున విక్రయించేవారని అన్నారు. ఇలా వీరు కొనుగోలు చేసిన 50 కేజీలలో 24.8 కేజీలు స్వాధీన పరచుకున్నామన్నారు. రెండు స్కోడా కార్లు, బొలెరో వాహనాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. రూ.40 వేల నగదు, 10 మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. వీరిని కోర్టు ముందు హాజరు పరచగా మేజిస్ట్రేట్  రిమాండు కు తరలించినట్లు వివరించారు.

అంతర్ రాష్ట్ర గంజాయి ముఠాను పట్టుకోవడానికి సహకరించిన నిర్మల్ డిఎస్పీ గంగారెడ్డి, నిర్మల్ గ్రామీణ సిఐ శ్రీనివాస్, నిర్మల్ రూరల్ ఎస్ఐ చంద్ర మోహన్, దిలావర్ పూర్ ఎస్ఐ యాసిత్ ఆరాఫత్ అలీ, సారంగాపూర్ ఎస్ఐ కృష్ణ సాగర్ రెడ్డి, నర్సాపూర్ (జి) ఎస్ఐ పి.రవీందర్, ఐటి కోర్ ఎస్ఐ రవి కుమార్ మరియు పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల  అభినందించారు.