బిఆర్ఎస్, బిజేపి దొందూ దొందే

బిఆర్ఎస్, బిజేపి దొందూ దొందే

ముద్ర ప్రతినిధి, నిర్మల్: కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ, రాష్ట్రం లోని భారతీయ రాష్ట్ర సమితి పార్టీలు రెండూ రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నాయని, కక్ష సాధింపు చర్యలే రాజకీయాలుగా వ్యవహరిస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ తెలంగాణా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ విమర్శించారు. నిర్మల్ లో మంగళవారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. గత కొద్ది మాసాలుగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు దేశవ్యాప్తంగా అనూహ్య స్పందన వచ్చిందని అన్నారు. ఈ స్పందన చూసి ఓర్వలేని కేంద్ర ప్రభుత్వం ఎలాగైనా ఆయన ప్రతిష్టను దెబ్బతీసేందుకు పన్నిన కుట్రలో భాగమే ఆయన లోకసభ సభ్యత్వం రద్దు అని విమర్శించారు. ఇక రాష్ట్రంలో భారాస కాంగ్రెస్ నేతలను ప్రలోభాలకు గురి చేస్తూ రాజకీయాలను దిగజారుస్తున్నదని ఆరోపించారు. ప్రజాసంక్షేమం మరచిన ఈ రెండు ప్రభుత్వాలకి ప్రజలే గుణపాఠం చెబుతారని దయాకర్ హెచ్చరించారు.