రూ 3 లక్షల కోట్లతో 20వేల పరిశ్రమల స్థాపన

రూ 3 లక్షల కోట్లతో 20వేల  పరిశ్రమల స్థాపన
  • రూ.3 లక్షల కోట్లతో 20వేల  పరిశ్రమల స్థాపన
  • కేటీఆర్ కృషితో ఐటీ రంగంలో అద్వితీయ పురోగతి
  • ప్రపంచ దిగ్గజ కంపెనీల ప్రధాన కార్య స్థానం తెలంగాణ
  • రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహిస్తున్న కెసిఆర్ ప్రభుత్వం హయాంలో దాదాపు రూ 3 లక్షల కోట్లతో 20వేల పరిశ్రమలు రూపుదిద్దుకున్నాయని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. స్వరాష్ట్ర సాధన అనంతరం కేటీఆర్ కృషి ఫలితంగా ఐటి రంగంలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని పేర్కొన్నారు. కేటీఆర్ పడుతున్న కష్టంలో కనీసం సగం సమయం మోడీ కష్టపడ్డా జిడిపి ఎంతో అభివృద్ధి చెందేదన్నారు. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిజామాబాద్ కలెక్టరేట్లో తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధి దినోత్సవం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న టీఎస్ ఐ పాస్ విధానంలో  సింగిల్ విండో రూపంలో అన్ని అనుమతులు ఒకే చోట లభిస్తుండడంతో పరిశ్రమల స్థాపనకు అనుకూలతలు ఏర్పడ్డాయన్నారు. మంత్రి కేటీఆర్ కృషిని పలువురు పారిశ్రామికవేత్తలు అభినందించడం ఆయన నిబద్ధతకు నిదర్శనమన్నారు. శాంతా బయోటెక్ వ్యవస్థాపకులు వరప్రసాద్, ప్రపంచ ప్రఖ్యాత ఫాక్స్ కాన్ సీఈవో, బాష్ కంపెనీ నిర్వాహకులు దత్తాత్రి వంటి ప్రముఖులు సైతం అభినందించారన్నారు. గతంలో పవర్ హాలిడే అమలుపరిచిన కారణంగా పరిశ్రమలు మూతపడ్డాయన్నారు.

కాని ప్రస్తుత ప్రభుత్వ హయాంలో అన్ని అనుమతులు సకాలంలో రావడమే కాకుండా విద్యుత్ సరఫరా నీటి సరఫరా 24 గంటల పాటు నిరాటంకంగా అందిస్తున్నామన్నారు. ఈ తోడ్పాటును గుర్తించి గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు హైదరాబాద్ వైపు చూస్తున్నాయన్నారు. 9 ఏళ్లలో రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులతో 24 లక్షల మందికి కొత్తగా ఉద్యోగాలు వచ్చాయన్నారు. ఐటి ఉత్పత్తుల ఎగుమతుల విషయానికొస్తే 2014 లో కేవలం 57 వేల కోట్ల విలువైన ఉత్పత్తుల ఎగుమతి జరగగా ప్రస్తుతం అది రూ.2.44 లక్షల కోట్లకు చేరిందన్నారు. ప్రభుత్వ కృషి ఫలితంగా తలసరి ఆదాయంలో, తలసరి విద్యుత్ వినియోగంలో రాష్ట్రం అగ్రగామిగా ఉందన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు టీ ఎస్ ఐ పాస్ లో దరఖాస్తు చేసుకున్న తక్కువ కాలంలో అనుమతి లభిస్తోందన్నారు. నిజామాబాద్ జిల్లాలో రూ. 800 కోట్లతో 745 యూనిట్లకు అనుమతి ఇవ్వడం జరిగిందన్నారు. ఫలితంగా 13 వేల మందికి ఉద్యోగాలు లభించాయన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠల్రావు, అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, మేయర్ నీతు కిరణ్, మార్క్ఫెడ్ చైర్మన్ గంగారెడ్డి, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, పరిశ్రమల జనరల్ మేనేజర్ సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.