జర్నలిస్టుల సమస్యలకు త్వరలో పరిష్కారం

జర్నలిస్టుల సమస్యలకు త్వరలో పరిష్కారం

మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి హామీ

ముద్ర న్యూస్ బ్యూరో, హైదరాబాద్: రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సుముఖంగా ఉన్నారని మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాసరెడ్డి తెలిపారు. మంగళవారంనాడు ఆయన తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూ జే) విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు, ఆరోగ్య భద్రత వంటి సంక్షేమ కార్యక్రమాలు త్వరలో అందుతాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. జర్నలిస్టులకు సంక్షేమ కార్యక్రమాలను అందించడంతోపాటు వృత్తిపరమైన శిక్షణ, మీడియా ప్రమాణాలను మెరుగుపరచడానికి తన శాయశక్తులా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.


టీయూడబ్ల్యుజే అధ్యక్షుడు నగునూరి శేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు, ఐజేయు స్టీరింగ్ కమిటీ సభ్యుడు దేవులపల్లి అమర్, ఐ జేయూ కార్యదర్శి వై నరేందర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యుడు కే సత్యనారాయణ, ఐ జేయూ సీనియర్ నాయకుడు డి కృష్ణారెడ్డి, టీయూడబ్ల్యూజే ఉప ప్రధాన కార్యదర్శి విష్ణు దాస్ శ్రీకాంత్, ఉపాధ్యక్షులు కే రామనారాయణ, దొంతు రమేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా శాఖల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. సమావేశంలో తొలుత ఇటీవల మరణించిన జర్నలిస్టులకు నివాళులర్పించారు. ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ యూనియన్ కార్యకలాపాల నివేదికను సమర్పించారు. మీడియా అకాడమీ చైర్మన్ గా నియమితులైన కె శ్రీనివాస్ రెడ్డిని, ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీయూడబ్ల్యూజే అధ్యక్షుడుగా ఎన్నికైన విరాహత్ అలీని, జవహర్ లాల్ నెహ్రూ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడిగా ఎన్నికైన బి కిరణ్ కుమార్ ను కార్యవర్గం అభినందించింది.