కోదాడ సాహిత్య సాంస్కృతిక కేంద్రం

కోదాడ సాహిత్య సాంస్కృతిక కేంద్రం
  • కీర్తి పురస్కార గ్రహీత వేములను సన్మానించిన జూలూరు 

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-కోదాడ ప్రాంతం సాహిత్య, సాంస్కృతిక రంగాలకు కేంద్ర బిందువుగా నిలిచిందని, తెలంగాణ ముఖద్వారమైన కోదాడ, గ్రంథాలయ ఉద్యమానికి , సాహిత్య, సాంస్కృతిక రంగాలకు కేంద్రంగా వర్ధిల్లుతున్నదని అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలో తెలుగు విశ్వవిద్యాలయ 'కీర్తి పురస్కార' గ్రహీత, అధ్యాపకులు వేముల వెంకటేశ్వర్లును సాహిత్య అకాడమీ చైర్మన్ సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....

ఈ ప్రాంతానికి వన్నెతెస్తూ, ఈ ప్రాంత ఔన్నత్యాన్ని పెంచుతూ, కొమర్రాజు లక్ష్మణరావు, గ్రంథాలయ ఉద్యమకర్త కోదాటి నారాయణరావు, నాటక రచయిత కే.ఎల్. నరసింహారావు,సంగీత,నాటక కళాకారులు వేముల నర్సింహంల వారసత్వాన్ని కొనసాగిస్తూ గత మూడు దశాబ్దాలకు పైగా సాహిత్య, సామాజిక, సాంస్కృతిక కళారంగాలను ముందుకు తీసుకుపోతున్నందుకు వేముల వెంకటేశ్వర్లును హృదయపూర్వకంగా ఆయన అభినందించారు. తెలంగాణ ఉద్యమానికి పాదువేసిన ప్రాంతంగా నడిగూడెం, తెలంగాణ నాటక రంగానికి ప్రయోక్తగా నిలిచిన రేపాల, కూచిపూడి నృత్యానికి కూచిపూడి కేంద్రంగా ఉన్న కూచిపూడి గ్రామాలు చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తాయని అన్నారు. సిరిపురం గ్రామానికి చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, సంగీత, నాటక కళాకారులు అయిన వేముల నర్సింహం "తొలి తెలంగాణ సన్నాయి రేడియో ఆర్టిస్టుగా" హార్మోనిస్టుగా. ఫ్లూట్. గాత్రం . నటన . మేకప్. స్వర కల్పనలో ప్రఖ్యాతిగాంచిన కళాకారుడి కుమారుడిగా వేముల వెంకటేశ్వర్లు ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారని  అన్నారు. "సాంస్కృతిక సంస్థ నిర్వాహకుడిగా"వారి సేవలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలుగు విశ్వవిద్యాలయం గుర్తించి "కీర్తి పురస్కారం" ఇచ్చిందని, ఈ సందర్భంగా వేముల వెంకటేశ్వర్లకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

30 సంవత్సరాల క్రితం కోదాడలో "తెర సాంస్కృతిక కళామండలి"ని వేముల వెంకటేశ్వర్లు వ్యవస్థాపక అధ్యక్షునిగా స్థాపించి అనేక సాహిత్య, సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తూ, నిర్వహించిన కార్యక్రమాలను ప్రత్యేక సంచికల పేరుతో ముద్రించి, రాబోయే తరాల వారి కోసం కళా సంబంధిత, సాహిత్య సంబంధిత కార్యక్రమాలను అక్షరబద్ధం చేయడం గొప్ప విశేషమన్నారు. అలాగే  "తెర కళా పురస్కారాలు" అనేకమంది పెద్దలకు అందించడంతో పాటు నాటక, రంగస్థల ప్రదర్శనలతో అందరి హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న తెర సాంస్కృతిక కళామండలి ఇంకా అనేక కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్లాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా వేముల వెంకటేశ్వర్లను ఆయన సత్కరించారు.ప్రొఫెసర్ కిషోర్ రెడ్డి , హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఉపాధ్యక్షులు,  కోయ చంద్రమోహన్ లు వేములను సన్మానించారు.ఈ కార్యక్రమంలో తెర సాంస్కృతిక కళామండలి సాంస్కృతిక కార్యదర్శి షేక్. మీరా, ప్రచార కార్యదర్శి ఎస్.కె పీర్ సాహెబ్, నాగుల్ మీరా, జూలూరు శివకుమార్ పాల్గొన్నారు.