నయా నిజాం కేసీఆర్ 

నయా నిజాం కేసీఆర్ 
  • త్వరలోనే మాజీ  కావడం ఖాయం
  • ఒవైసీ, కేసీఆర్ మామా అల్లుళ్లు
  • కాంగ్రెస్, బీఆర్ఎస్ ఓటు బాంకు రాజకీయాలను నమ్మొద్దు
  • డిపాజిట్లు రాని కాంగ్రెస్ అధికారం చేపడుతుందా?
  • మంత్రి ఇంద్రకరణ్ ఆగడాలకు అంతం పలకండి 
  • భైంసా సభలో బండి సంజయ్ కుమార్

ముద్ర ప్రతినిధి, నిర్మల్ /బాసర : నయా నిజాం కేసిఆర్ పాలన పతనానికి వచ్చే నెల 3న ముహూర్తం ఖరారైందని, త్వరలో ఆయన మాజీ కావడం ఖాయమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. ఆస్పత్రిలో మందు తాగుతూ దీక్ష చేసిన కేసీఆర్ వల్ల తెలంగాణా రాలేదన్నారు. వందలాది మంది యువత ప్రాణ త్యాగాలతో రాష్ట్ర సాధన సాకారమైందని తెలిపారు. తెలంగాణా బిల్లుకు మద్దతు సైతం పలికని వ్యక్తి తెలంగాణా తెచ్చాననడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ఎన్నో ఎన్నికల్లో డిపాజిట్లు సైతం రాని కాంగ్రెస్​అధికారం చేపడుతుందా? అని ప్రశ్నించారు. ఎంఐఎం నేత ఒవైసీ, కేసీఆర్ మామా అల్లుళ్లని, ఒకరికి ఒకరు సహకరించుకుంటారని ఎత్తి పొడిచారు. నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గం భైంసాలో శనివారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు తన ఫొటో పెట్టుకుని కేసీఆర్ ఊరేగుతున్నాడన్నారు.

భైంసా సభకు వచ్చిన జనాన్ని చూస్తే కేసీఆర్ గుండె పగిలిపోవడం ఖాయమని అన్నారు. ఈ జనాన్ని చూస్తుంటే ఇక్కడ బీజేపీ బంపర్ మెజార్టీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడి యువత ఛత్రపతి శివాజీ ప్రతీకలుగా మారి డిసెంబర్​3న ముథోల్ లో విజయోత్సవాలు జరపాల్సిందేనన్నారు.  రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని దుష్ప్రచారం చేస్తున్నారని అయితే ఆ పార్టీ పరిస్థితి పూర్తిగా దిగజారి పోయిందన్నారు. ఆ పార్టీకి ఇప్పటి వరకు జరిగిన ఏ ఎన్నికల్లోనూ డిపాజిట్లే రాలేదని అన్నారు. ఆ పార్టీ అధికారంలోకి ఎలా వస్తుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను చూసి జనం నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టో చెల్లని రూపాయి అని,  ఆ పార్టీ ఇచ్చే హామీలకు విలువ లేదని విమర్శించారు. రాష్ట్రంలో 12శాతం ఓట్ల కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ కక్కుర్తి పడుతున్నాయన్నారు. బీఆర్ఎస్ ఓట్ల కోసం ఎంఐఎంను నమ్ముకుంటే, కాంగ్రెస్ ముస్లిం మతపెద్దలను నమ్ముకుందన్నారు.

జిల్లాకి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి అల్లోల అనుచరుల ఆగడాలకు అంతులేకుండా పోయిందని మండిపడ్డారు. దేవాదాయ మంత్రిగా ఉంటూ దేవుడి మాన్యాలను చెరబడుతూ, ఒక వర్గం ఓట్లకోసం ఈద్గాకు భూములను అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ధారాదత్తం చేయాలనుకున్నారని దుయ్యబట్టారు.  ట్రిపుల్ ఐటీ సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన ట్విటర్ పిట్ట కేటిఆర్ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వస్తే ముథోల్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. నాందేడ్ నుంచి బైంసా- నిర్మల్ మీదుగా మంచిర్యాల వరకు రైల్వే లైన్ నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. పత్తి పంట బాగా పండే ముధోల్ నియోజకవర్గంలో టెక్స్ టైల్ పార్క్, పీజీ కాలేజీ, ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గోదావరిపై ఎత్తిపోతల పథకాలు నిర్మించి ముథోల్ నియోజకవర్గానికి పూర్తిస్థాయిలో సాగునీరందిస్తామని హామీ ఇచ్చారు. పెండింగ్ లో ఉన్న సుద్ధ(గడ్డెన్న)వాగు ప్రాజెక్టు కాలువల నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. పల్సికర్ రంగారావు ప్రాజెక్టు ముంపు గ్రామాన్ని అన్ని విధాలా ఆదుకుంటానన్నారు. ముథోల్ దత్తత తీసుకుని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని, బైంసాను మైసాగా మారుస్తానని ప్రకటించారు.