అంతా ఐక్యంగా పనిచేశారు

అంతా ఐక్యంగా పనిచేశారు
  • బీఆర్‌‌ఎస్‌ శ్రేణులు, ప్రజలకు నా ధన్యవాదాలు
  • ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌‌రెడ్డి

ముద్ర ప్రతినిధి, జనగామ : బీఆర్‌‌ఎస్‌ కార్యకర్తల్లో అక్కడక్కడ కొన్ని విభేదాలు ఉన్నా.. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తన కోసం ఐక్యంగా పనిచేశారని, వారందరికీ ప్రత్యేక ధన్యవాదులు తెలుపుతున్న బీఆర్‌‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌‌రెడ్డి ప్రకటించారు. శుక్రవారం పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు, జడ్పీ చైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డి, స్టేషన్‌ఘన్‌పూర్‌‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతో కలిసి పల్లా విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్‌‌ చేపట్టిన పథకాలు, చేస్తున్న సంక్షేమాన్ని చూసి తనను ఆశీర్వదించారని తెలిపారు. 3వ తేదీ ఫలితాల్లో తాను ఎమ్మెల్యేగా గెలిచి తీరుతానని ధీమా వ్యక్తం చేశారు. తన గెలుపుకోసం పనిచేసిన ప్రతీ కార్యకర్తకు పల్లా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఆరుట్లకు ఆవేశం తప్ప.. ఆలోచన లేదు..

జనగామ బీజేపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే అభ్యర్థి ఆరుట్ల దశమంతరెడ్డికి ఆవేశం తప్ప ఆలోచన లేదని పల్లా రాజేశ్వర్‌‌రెడ్డి విమర్శించారు. నిన్న జరిగిన పోలింగ్‌ సందర్భంగా తమ కార్యకర్త కృష్ణ ప్రసాద్‌ను అకారణంగా కొట్టారని మండిపడ్డారు. సీఎం నాయకుడు బూడిద గోపి ఓ రౌడీలా వ్యవహరించాడన్నారు. బీఆర్‌‌ఎస్‌ లీడర్లపై ఇలా భౌతిక దాడులకు దిగడం సరికాదన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి కొడుకు కొమ్మూరి ప్రశాంత్‌ రెడ్డి ప్రతి చోట వెకిలి చేష్టలతో తనను డిస్టబ్‌ చేసాడని ఆరోపించారు. ఇక కొందరు అధికారులు సైతం ప్రతిపక్ష పార్టీలకు సహకారం అందించాయని పల్లా పేర్కొన్నారు. వీరందరిపై రుజువులతో ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. సమావేశంలో జనగామ మున్సిపల్‌ చైర్‌‌పర్సన్ జమున లింగయ్య, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బాల్దె సిద్దిలింగం, టీఆర్‌‌ఎస్‌ నాయకులు పసుల ఏబేలు, నిమ్మతి మహేందర్‌‌రెడ్డి, ఇర్ర రమణారెడ్డి, బద్దిపడగ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.