బర్రెలక్కకు మద్దతుగా శంకరపట్నం యువత

బర్రెలక్కకు మద్దతుగా శంకరపట్నం యువత

శంకరపట్నం ముద్ర నవంబర్ 25 : శంకరపట్నం మండలంలోని నిరుద్యోగ యువత బర్రెలక్క అలియాస్ శిరీషకు సంపూర్ణ మద్దతును తెలిపారు. శనివారం జాతీయ బీసీ సంఘం మండల అధ్యక్షుడు బొంగోని అభిలాష్ గౌడ్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువత మద్దతు ప్రకటించారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం స్వాతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగ పోటీచేస్తున్న శిరీష కు మద్దతు ఇవ్వాలని కోరారు. బిఆర్ఎస్ ప్రభుత్వంలో నోటిఫికేషన్లు, ప్రభుత్వ ఉద్యోగం రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

శిరీష లాంటి నిరుద్యోగులు రాజకీయంలోకి రావడం చాలా శుభ సూచకమని అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన అసమ్మతి స్వరాన్ని వినిపించినందుకు శిరీషపై గతంలో అక్రమ కేసులు పెట్టారన్నారు. ప్రచార సమయంలో వారి కుటుంబ సభ్యులపై భౌతిక దాడులను పూర్తిగా నిరుద్యోగ యువత తరఫున ఖండిస్తున్నామని తెలపడం జరిగింది. నిరుద్యోగుల మద్దతు ఎల్లవేళలా ఆమెకు ఉంటాయని వారన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల్, శ్రీకాంత్, వంగోజు సాగర్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.