కేసీఆర్‌‌ సభను సక్సెస్‌ చేయాలి

కేసీఆర్‌‌ సభను సక్సెస్‌ చేయాలి
  •  లక్ష మంది జన సమీకరణ టార్గెట్‌
  •  పార్కింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నాం
  •  ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌‌రెడ్డి

ముద్ర ప్రతినిధి, జనగామ : ఈ నెల 16న జనగామ జిల్లా కేంద్రంలో జరిగే సీఎం కేసీఆర్‌‌ ‘ఆశీర్వాద సభ’ను సక్సెస్‌ చేయాలని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌‌రెడ్డి కార్యకర్తలకు పిలపునిచ్చారు. శనివారం మంత్రి దయాకర్‌‌రావు, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్యలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్‌‌ఎస్‌ అధినేత సీఎం కేసీఆర్‌‌ మ్యానిఫెస్టో ఫైనల్‌ చేసిన తర్వాత ఉమ్మడి వరంగల్‌లోని నిర్వహించే తొలి సభకు విచ్చేస్తున్నారని తెలిపారు. ఈ సభకు సంబంధించి అన్ని పర్మిషన్లు తీసుకుని పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. జిల్లాలోని మూడు నియోజవకర్గాల నుంచి లక్ష మంది జన సమీకరణకు టార్గెట్‌గా పెట్టుకున్నా.. 2 లక్షల మందికి సరిపడే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ప్రతీ బూత్‌కు ఒక కమిటీ వేసి ప్రణాళిక బద్దంగా ముందుకు సాగుతున్నామని వివరించారు. మూడు నియోజకవర్గాల నుంచి వచ్చే వారికి ఇబ్బందులు కాకుండా ఏ వైపు వారికి ఆ వైపే పార్కింగ్‌ ఏర్పాట్లు చేశామన్నారు. సభలు నిర్వహించడంలో బీఆర్‌‌ఎస్‌ నంబర్‌‌ వన్‌ స్థానంలో ఉంటుందని, గతంలో వరంగల్‌ ప్రకాశ్‌రెడ్డిపేటలో అతి సభ నిర్వహించామని గుర్తుచేశారు. అదే స్ఫూర్తితో జనగామ సభను సక్సెస్‌ చేసేందుకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని కోరారు. సమావేశంలో జడ్పీ చైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్‌‌పర్సన్‌ పోకల జమున, బీఆర్‌‌ఎస్‌ రాష్ట్ర నేత జల్లి సిద్ధయ్య, జనగామ మార్కెట్‌ చైర్మన్‌ బాల్దె సిద్దిలింగం, కొమురవెల్లి దేవస్థానం మాజీ చైర్మన్‌ సేవెల్ల సంపత్‌,  టీఆర్‌‌ఎస్‌ నేత కందుకూరి ప్రభాకర్‌ ‌తదితరులు పాల్గొన్నారు.