రేవంత్‌రెడ్డి ఓ చీటర్

రేవంత్‌రెడ్డి ఓ చీటర్
  •  అమ్మడం, అమ్ముడుపోవడం ఆయనకు కొత్త కాదు
  •  ఎమ్మెల్యే టికెట్లు అమ్ముతుండని సొంత పార్టీ వారే ఆరోపిస్తున్నరు
  •  పొన్నాలపై ఇష్టారీతిగా మాట్లాడడం బాధకరం
  •  లక్ష్మయ్య బీఆర్‌‌ఎస్‌లోకి వస్తానంటే ఇంటికెళ్లి తీసుకొస్తాం
  • మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌రావు


 ముద్ర ప్రతినిధి, జనగామ :
టీపీసీసీ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి ఓ పెద్ద చీటర్‌‌ అని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌రావు అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే టికెట్‌ అమ్ముకుంటున్నాడని సొంత పార్టీ లీడర్లే ఆరోపిస్తున్నారని, అయినా అమ్మడం, అమ్ముపోవడం రేవంత్‌రెడ్డికి కొత్తమి కాదని మంత్రి మండిపడ్డారు. శనివారం జనగామ జిల్లా పార్టీ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌‌రెడ్డి, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్యతో కలిసి ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌ ప్రజల కోసం ఏం చేసిందని ప్రశ్నించారు. కేసీఆర్‌‌ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందన్నారు. ఆయన దయవల్లే జనగామ నియోజకవర్గానికి తాగు, సాగు నీరు వచ్చిందన్నారు. కల్యాణలక్ష్మి, షాదీమురాక్, పెషన్షల ద్వారా ఎంతో మంది లబ్ధిపొందారని గుర్తుచేశారు. కాంగ్రెస్‌ పాలనలో ప్రజలు అరిగోస పడ్డారని గుర్తుచేశారు. ఇక రేవంత్‌రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు అయ్యాక ఆ పార్టీ మరింత ఆధ్వానంగా తయారైందన్నారు. దొంగ వాగ్దానాలతో ప్రజల్లోకి వస్తున్న కాంగ్రెస్‌ ప్రతీ ఒక్కరు నిలదీయాలన్నారు. 
పొన్నాలను స్వాగతిస్తాం...
జనగామకు చెందిన సీనియర్‌‌ బీసీ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యపై రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు. ఓ సీనియర్‌‌ నేత 40 ఏళ్లుగా పార్టీ జెండాను మోసిన లీడర్‌‌పై చిల్లరగా మాట్లాడడం బాధాకరం అన్నారు. పొన్నాల బీఆర్‌‌ఎస్‌లోకి వస్తానంటే ఇంటికి వెళ్లి పట్టుకొస్తామని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు.  సమావేశంలో జడ్పీ చైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్‌‌పర్సన్‌ పోకల జమున, బీఆర్‌‌ఎస్‌ రాష్ట్ర నేత జల్లి సిద్ధయ్య, జనగామ మార్కెట్‌ చైర్మన్‌ బాల్దె సిద్దిలింగం, కొమురవెల్లి దేవస్థానం మాజీ చైర్మన్‌ సేవెల్ల సంపత్‌,  టీఆర్‌‌ఎస్‌ నేత కందుకూరి ప్రభాకర్‌ ‌తదితరులు పాల్గొన్నారు.