త్వరలో మెగా మాస్టర్ ప్లాన్

త్వరలో మెగా మాస్టర్ ప్లాన్
  • ‘మూసీ’ పునరుజ్జీవానికి బృహత్ ప్రణాళిక
  • మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం
  • విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తాం
  • ఆల్ ఇండియా బిల్డర్స్ సదస్సులో సీఎం రేవంత్

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి తమ ప్రభుత్వం మెగా మాస్టర్ ప్లాన్–2050ను తీసుకొస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో విధ్వంసమైన రాష్ట్రాన్ని తిరిగి పునర్ నిర్మాణం చేసే బాధ్యత తమపై ఉందన్నారు. ఇందుకు మీ(బిల్డర్ల) వంతు సహకారం ఎంతో అవసరమన్నారు. మీ అనుభవాన్ని రాష్ట్రాభివృద్ధికి ఉపయోగించాలన్నారు. శనివారం రాత్రి హైదరాబాద్ హైటెక్స్ లో  31వ ఆల్ ఇండియా బిల్డర్స్ కన్వెన్షన్ ను  ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి ప్రారంభించారు. బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,

రాష్ట్రాభివృద్ధిలో బిల్డర్స్  పాత్ర కీలకం..
దేశాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో బిల్డర్స్ పాత్ర చాలా ముఖ్యమైనదన్నారు. అందుకే కాంగ్రెస్  ప్రభుత్వం మీతో ఉందని చెప్పడానికే  తాము ఇక్కడికి వచ్చామన్నారు. బిల్డర్లు ఆర్థికంగా బలపడితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. ఈ నేపథ్యంలో బిల్డర్స్ సమస్యలకు తప్పకుండా  తమ ప్రభుత్వం పరిష్కారం చూపుతుందన్నారు. ప్రపంచంలో ఏ దేశమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే ముందుగా రవాణా సౌకర్యం,  మౌలిక వసతులు మెరుగుపడాల్సిన అవసరముందన్నారు. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సిన అవసరముందన్నారు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రజా రవాణా సౌకర్యానికి అధిక ప్రాధాన్యను ఇస్తున్నామన్నారు. నగరం నలమూలకు మెట్రో రైల్ సేవలను ప్రజలకు  కల్పిస్తామన్నారు. దేశ సంస్కృతి, సంప్రదాయాలు పూర్తిగా వారసత్వ కట్టడాలపైనే ఆధారపడి ఉంటుందన్నారు. వాటిని నిర్మించడంలో బిల్డర్ల పాత్ర ఆమోఘమన్నారు.

మూసీని పునరుద్ధరిస్తాం
హైదరాబాద్ కు మూసీ ఒక పెద్ద ఎస్సెట్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే మూసీని పునరుద్ధరించడానికి తమ ప్రభుత్వం నడుం బిగించిందన్నారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును ప్రభుత్వం ముందుకు తీసుకొస్తోందన్నారు. ఈ నేపథ్యంలో మూసీ రివర్ ఫ్రంట్ పై తమ ప్రభుత్వంగా హై ఫోకస్ పెట్టిందన్నారు. ప్రపంచ స్థాయి దృష్టిని ఆకర్షించే డిజైన్లు, నమూనాలను రూపొందిస్తున్నామన్నారు. సుమారు 56 కిలోమీటర్ల పొడవునా మూసీ రివర్ ఫ్రంట్, గ్రీన్ అర్బన్ పార్క్ లు, షాపింగ్ కాంప్లెక్స్​ల నిర్మాణాలకు సంబంధించిన డిజైన్లు ప్రక్రియ జరుగుతోందన్నారు. చారిత్రాత్మక నగరాలన్నీనీటి వనరుల చుట్టే అభివృద్ధి చెందాయన్నారు. నదులు, సరస్సులు వాటికి సహజత్వాన్ని తెచ్చిపెట్టాయన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని మూసీ నది పునరుద్ధరణతో హైదరాబాద్‌ సిటీ ప్రపంచంలోనే అద్భుతమైన నగరంగా తీర్టిదిద్దుతామన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమమైన బెంచ్‌మార్క్ నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. ఒకప్పుడు గొలుసుకట్టు చెరువులతో హైదరాబాద్ నగరం లేక్ సిటీగా గుర్తింపు పొందగా  చార్మినార్ వంటి కట్టడాలు మరింత ప్రఖ్యాతిని తీసుకొచ్చాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు ఎస్.ఎన్.రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కన్వెన్షన్  చైర్మన్ ఆర్ రాధాకృష్ణన్, ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ బొల్లినేని శ్రీనయ్య, బిల్డర్స్ అసోసియేషన్ స్టేట్ చైర్మన్ కే దేవేందర్ రెడ్డి, కన్వెన్షన్ కమిటీ వైస్ చైర్మన్ వి సుగుణాకర రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎన్ సచ్చిదానంద్ రెడ్డి, కన్వెన్షన్ కమిటీ సెక్రటరీ డివిఎన్ రెడ్డి, ఆర్గనైజింగ్ కమిటీ  జాయింట్ సెక్రెటరీ సుధాకర్ రావు, ఫైనాన్స్ కమిటీ చైర్మన్ సంకినేని కృష్ణారావు తదితరులు సదస్సు నిర్వహణలో కీలక భూమిక పోషించారు.