ఇది ట్రైలరే!

ఇది ట్రైలరే!
  • పదేళ్లలో కొంతే చేశాం
  • చేయాల్సింది ఇంకా చాలా ఉంది
  • దేశాన్ని విభజించడమే కాంగ్రెస్ ఐడెంటిటీ
  • చురు ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోడీ

చురు: భారతీయ జనతా పార్టీ  సారథ్యంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి పదేళ్లలో చేసిన అభివృద్ధి పనులు కేవలం ట్రైలర్​లాంటివని.. ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. శుక్రవారం రాజస్థాన్‌ లోని చురులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోడీ మాట్లాడారు. 

నాకు ఎన్నో డ్రీమ్స్​ ఉన్నాయి..

‘‘పదేళ్లలో సాధించిన ప్రగతి కంటే చేయాల్సింది చాలా ఉంది. నాకు ఎన్నో కలలు ఉన్నాయి. దేశాన్ని అభివృద్ధిలో మేము మరింత ముందుకు తీసుకువెళ్తాం’’ అని పేర్కొన్నారు. 2019 ఫిబ్రవరి 26న తాను చురు వచ్చినప్పుడు బాలాకోట్‌లో ‘ఎయిర్ స్ట్రైక్’ జరిగింది. టెర్రరిస్టులకు మనం గుణపాఠం చెప్పాం. భరతమాతను ఎట్టి పరిస్థితుల్లోనూ తలదించుకోనీయమని ఆ సమయంలో నేను చెప్పాను. భారత్ సర్జికల్ దాడులు, వాయుదాడులు జరిపినప్పుడు కాంగ్రెస్, విపక్ష కూటమి నేతలు ఆధారాలు చూపించమని ప్రశ్నించారు. దేశాన్ని విభజించడం, సైన్యాన్ని అవమానించడమే కాంగ్రెస్ పార్టీ ఐడెంటిటీ అని మోడీ ఎద్దేవా చేశారు. అయోధ్యలో రామమందిరం అంశం విషయంలోనూ మౌనంగా ఉండాలని తమ పార్టీ యూనిట్లకు కాంగ్రెస్ అడ్వైజరీ జారీ చేసిన విషయం తన దృష్టికి వచ్చిందని చెప్పారు.

ట్రిపుల్ తలాక్ ముస్లింలకు మేలు చేసింది..

ట్రిపుల్ తలాక్ అంశం గురించి ప్రధాని మోడీ మాట్లాడుతూ ట్రిపుల్ తలాక్ చట్టం రద్దు ముస్లిం సోదరీమణులకు ఎంతో సహాయపడిందని చెప్పారు. ఎందరో ముస్లిం తల్లులు, సోదరీమణులను ప్రాణాలను కాపడమే కాకుండా ప్రతి ముస్లిం కుటుంబానికి మోడీ రక్షణగా నిలిచారని అన్నారు.

చెప్పిందే చేస్తాం..

కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయడాన్ని పరోక్షంగా మోడీ ప్రస్తావిస్తూ, బీజేపీ ఏదైతే చెప్పిందో అది చేసి చూపిస్తుందని అన్నారు. ఇతర పార్టీల్లా కాకుండా బీజేపీ కేవలం మేనిఫెస్టో విడుదల చేయడం కాకుండా ‘సంకల్ప్ పాత్ర’తో ముందుకు వస్తుందన్నారు. 2019 ‘సంకల్ప్ పాత్ర’లో ఏవైతే చెప్పామో వాటిలో దాదాపు అన్నింటినీ నెరవేర్చామని ప్రధాని వెల్లడించారు.