‘మీ భూమి’ తో  ధరణి మాయలకు చెక్​ 

 ‘మీ భూమి’ తో  ధరణి మాయలకు చెక్​ 
  • తెలంగాణా ఇరిగేషన్ స్కాముల మయం
  • మోడీ ఇచ్చే హామీలన్నీ మోడీ గ్యారంటీలు 
  • వచ్చే ఐదేళ్లు పేదలకు ఉచిత బియ్యం పంపిణీ 
  • బీఆర్ఎస్ , కాంగ్రెసు జిరాక్స్ కాపీలు 
  • సీఎం కేసీఆర్​ ఫాంహౌజ్​లో
  • కట్టర్​, కరెఫ్ట్​ పార్టీలు చేతులు కలిపాయి
  • మద్యం అవినీతిపరులకు జైలు తప్పదు
  • తూఫ్రాన్​, -నిర్మల్ బహిరంగ సభలో ప్రధాని మోడీ


ముద్ర ప్రతినిధి, మెదక్​/ నిర్మల్ : భూ మాఫియాకు మూలం ధరణి పోర్టల్​ అని, బీజేపీ అధికారంలోకి వచ్చాక ధరణి స్థానంలో  ‘మీ భూమి’ ప్రారంభిస్తామని దేశ ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు. మోడీ ఇచ్చిన హామీలు మోడీ గ్యారంటీలుగా భావించాలని కోరారు. తెలంగాణ అంటేనే స్కాములమయంగా మారిందని, అవినీతిపరులను జైలుకు పంపుతామని మోడీ హెచ్చరించారు. బీఆర్ఎస్ సుల్తాన్ షాహీ, నవాబ్ షాహీ పోకడల బీఆర్ ఎస్, కాంగ్రెస్ లను ఇంటికి పంపాలని, ఇరిగేషన్, భూ మాఫియాల నిలయంగా మారిన తెలంగాణను అభివృద్ధి పథంలోకి తేవటం కేవలం బీజేపీకే సాధ్యమని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ప్రధానమంత్రి మోడీ రాష్ట్రంలోని మెదక్​ జిల్లా తూఫ్రాన్​, నిర్మల్​లో ప్రచార చేశారు.  అన్నారు. సకల విజయ సంకల్ప సభలో ప్రధాని మాట్లాడుతూ లిక్కర్ స్కాం అవినీతిపరులకు జైలు తప్పదని స్పష్టం చేశారు. రైతులను ముంచడం, అవినీతిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీ పడుతున్నాయని, ఢిల్లీ కట్టర్, కరెప్ట్ కేసీఆర్ చేతులు కలిపారన్నారు. అన్ని వర్గాలను మోసం చేసిన కేసీఆర్ ఇక ఫాం హౌస్ కే పరిమితం అవుతారని, కాంగ్రెస్ పాలనలో దేశంలో ఉగ్రవాదులు దాడులతో అనేకమందిని పొట్టన పెట్టుకున్నారని, ఇదే రోజు బొంబాయి దాడులు జరిగాయంటూ గుర్తు చేశారు. 2014లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉగ్రవాదులు ఏ మూలాన ఉన్నా ఏరివేస్తు శాంతి నెలకొల్పుతున్నామ్మన్నారు. రాహుల్ గాంధీ అమేధి నుంచి వాయినాడ్ కు వచ్చినట్లు ప్రజలకు ఇచ్చిన మాట తప్పిన కేసీఆర్​రెండు చోట్ల పోటీ చేస్తున్నారని, కేసీఆర్ పాలనపై రైతులు, నిరుపేదలు అగ్రహంగా ఉన్నారని, దేవుడి పేరున మల్లన్న సాగర్ ప్రాజెక్టు కట్టి భూములు లాక్కున్నారని, రైతులకు పాపం చేసే వారికి మల్లికార్జునస్వామి కాదు రైతులు, నిరుపేదలు క్షమించరని అన్నారు. భగవంతుడి పేరున ప్రజలను ముంచడం బాధాకరమన్నారు. 

హామీలు ఎలా మరిచిపోతారు

ప్రతిసారి ఎన్నికల సమయంలో కేసీఆర్​ ఎన్నో హామీలు ఇస్తున్నారని, ఇచ్చిన హామీలు మరవడం కేసీఆర్​ నైజం అని ప్రధాని మోడీ విమర్శించారు. దళిత సీఎం, దళిత బందు, డబుల్ బెడ్ రూం, ఉద్యోగాలు ఇవ్వలేదని, రైతులకు సాగు నీరివ్వకుండా మోసం చేశారని ధ్వజమెత్తారు. పథకాల పేరుతో స్కాం చేస్తున్నారని, తెలంగాణ వచ్చాక ఆయన కుటుంబం కోసం కోట్ల రూపాయల అవినీతి చేశారని మండిపడ్డారు. కనీసం ప్రజలను కలవకుండా ఫాం హౌస్ లో ఉంటే సీఎం కావాలా అని ఓటర్లు ఆలోచించాలన్నారు. పదేళ్లుగా సచివాలయం వెళ్ళని ముఖ్యమంత్రి అవసరమా అంటూ తెలుగులో ప్రశ్నించారు. ఫాం హౌస్ నుండి పాలన చేసే సీఎంను పర్మనెంట్ గా ఫాం హౌస్ కు పంపాలని ప్రజలు నిర్ణయం తీసుకున్నారని మోడీ చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 30 శాతం కమీషన్ తీసుకున్నట్లు కేసీఆర్ ఒప్పుకున్నారని, కేసీఆర్ అవినీతి ఆరోపణలపై విచారణ  జరుగుతుందని మోడీ తెలిపారు. ఇక, కాంగ్రెస్ ది కుంభకోణాల చరిత్ర అని, కాంగ్రెస్ పాలనలో రైతులు, సైనికులు, యువకులకు అన్యాయం జరిగిందని, రుణమాఫీ, పేపర్ లికేజి కుంభకోణాలు ఉన్నాయన్నారు.

రెండు పార్టీలదీ ఒక్కటే 

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండూ అవినీతి మయమేనని, కుటుంబ పాలన, చెడు వ్యవస్థలు ఈ రెండు పార్టీలకు చిరునామా అని ప్రధాని మోడీ ఎద్దేవా చేశారు. ఈ రెండు పార్టీలు ఒక్కటే అని, కాంగ్రెస్, బీఆర్​ఎస్​తో జాగ్రత్తగా ఉండాలని మోడీ కోరారు. బీజేపీతోనే తెలంగాణ ప్రతిష్ట పెరుగుతుందని, బిఆర్ఎస్, కాంగ్రెస్ రోగాల నుండి బీజేపీ చికిత్స చేసి రక్షిస్తుందని మోడీ హామీ ఇచ్చారు. ఈ రెండు పార్టీల పాలనలో కొన్ని కుటుంబాలే బాగుపడ్డాయని, నిరుపేదలు, ఎస్సి, ఎస్టీ, బిసిలకు న్యాయం చేయలేదని, కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో బీసీని సీఎం చేయలేదని, ఆ పార్టీలో ప్రతిభావంతులకు అవకాశం రాలేదని దుయ్యబట్టారు.బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తే మొదటిసారిగా బీసీ నేతను సీఎం చేస్తుందని మోడీ మరోసారి ప్రకటించారు. సామాజిక న్యాయం కేవలం బీజేపీతోనే సాధ్యం అవుతుందని, మాదిగలకు న్యాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కమిటీ వేసిందని, సుప్రీం కోర్టులో కేసు ఉందని, త్వరలో న్యాయం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని స్పష్టం చేశారు. 

లూటీ చేస్తున్నారు

కాంగ్రెస్ సుల్తాన్, కేసీఆర్ నిజాం కుటుంబాన్ని పెంచి పోషిస్తున్నారని, నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఉద్యమం తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కేసీఆర్ కాళేశ్వరం పేరుతో నిధులు మింగాడని ప్రధాని మండిపడ్డారు. పదేండ్లలో ఒక్క నియామకం లేదని, గ్రూప్–-1 ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. దుబారా ఖర్చులతో అసమర్ద ప్రభుత్వం అప్పు పెంచిందని, తెలంగాణ రాష్ట్రాన్ని లూటి చేసిన కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టి దేశాన్ని లూటి చేసేందుకు చేశాడని, కానీ, ఆయన ప్రయత్నాలు మొదట్లోనే ఆగిపోయాయని అన్నారు. మద్యం అవినీతిలో కట్టర్, కరెప్ట్ పార్టీలు చేతులు కలిపాయని, దీనిపై విచారణ జరుగుతుందని, అవినీతి చేసిన కొందరు జైలులో ఉన్నారని, మద్యం అవినీతి నుంచి ఎవరూ బయటపడరని. జైలు తప్పదని, ఒక్కరు కూడా తప్పించుకోరని, మొబైల్ మారినా  కేసు తప్పదంటూ ప్రధాని హెచ్చరించారు. దేశంలో  రైతులకు సమ్మాన్ నిధి పేరుతో 2.75 లక్షల కోట్లు అకౌంట్లలో జమ చేశామని ప్రధాని ప్రకటించారు. రాష్ట్రంలో బీజేపీ గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుందని, బీసీ నేత సీఎం అవుతారని, మంత్రి వర్గంలో అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తామని అన్నారు.  

పది రోజుల్లో బీజేపీ ప్రభుత్వం

మరో పది రోజుల్లో తెలంగాణలో తొలి బిజేపి ప్రభుత్వం ఏర్పాటు కానుందని ప్రధాని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలతో ‘తెలంగాణా మే పహలీ బార్ – బిజేపి కా సర్కార్’ నినాదాన్ని పలికించారు. సీఎం కేసీఆర్​ కారు స్టీరింగ్ ఎంఐఎం చేతికి ఇచ్చి ఫామ్ హౌస్ లో పడుకున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో మంజూరైన ఇళ్ళు పేదలకు ఇప్పటికీ ఇవ్వలేదని, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదలకు ఇళ్ళు ఇస్తామని, ఇది మోడీ గ్యారంటీ అని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో బీఆర్​ఎస్​, దేశంలో కాంగ్రెస్​ మత రాజకీయాలను పెంచి పోషిస్తున్నారని, మతం పేరిట ఐటి పార్క్ ఇస్తామని కాంగ్రెసు ప్రకటించటం ఇందుకు నిదర్శనమన్నారు. కేసీఆర్​ ఎప్పుడు కాంగ్రెసు గురించి ఆలోచిస్తారని, ఎంఐఎం నాయకుడు కేసిఆర్ కు మద్దతు ఇస్తాడని, ఇది ఆ మూడు పార్టీల చీకటి ఒప్పందానికి నిదర్శనమన్నారు. నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో పసుపు పంటకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేశామన్నారు. తమ ప్రభుత్వం  మాదిగలకు రిజర్వేషన్ల కోసం కృషి చేస్తోందని అన్నారు. ఇంటింటికీ వెళ్ళి ప్రతివారు తమ కుటుంబ సభ్యులతో నిర్మల్ కు మోడీ వచ్చారని, అందరికీ నమస్కారాలు చెప్పి, ఆశీర్వదించాలని కోరారని చెప్పాలన్నారు. 

ఆకట్టుకున్న మోదీ తెలుగు

ప్రధాని మోడీ తూఫ్రాన్​, నిర్మల్​సభల్లో తెలుగులో పలుమార్లు మాట్లాడి ఆకట్టుకున్నారు. నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ అభినందనలు, ప్రియమైన ప్రజలారా, నాచారం లక్ష్మి నరసింహ స్వామిని స్మరిస్తూ, నా కుటుంబ సభ్యులారా అంటూ పలుమార్లు తెలుగులో ప్రస్తుతించారు. అలాగే ప్రజలను కలవని ముఖ్యమంత్రి మనకు కావాలా? సచివాలయం వెళ్ళని ముఖ్యమంత్రి అవసరమా అంటూ తెలుగులో ప్రశ్నించారు.