కాంగ్రెస్ ను కూలుస్తానంటే ఖబడ్దార్

కాంగ్రెస్ ను కూలుస్తానంటే ఖబడ్దార్
  • ప్రగతి భవన్ గేట్లు తెరుచుకున్నయి
  • విద్యుత్ శాఖలో 85వేలు సివిల్ సప్లై లో 56 వేల కోట్ల అప్పు
  • కరీంనగర్ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేస్తాం
  • రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందంటూ కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యల పై రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్ ఉద్దేశపూర్వకంగా కడియంతో మాట్లాడించాడా లేకుంటే కడియం వ్యక్తిగతమా తేలాల్సిన అవసరం ఉందన్నారు. కడియం వ్యక్తిగతం అయితే అతని ఎందుకు కేసీఆర్ మందలించడం లేదంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ ను ముట్టుకుంటే జాగ్రత్త అంటూ హెచ్చరించారు. ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వంపై మాట్లాడితే ధీటుగా స్పందించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంత్రిగా ఎన్నికైన అనంతరం తొలిసారిగా కరీంనగర్ జిల్లాకు వచ్చిన సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికి పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు.

ఈ సందర్భంగా ఇందిరా చౌక్ లో పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ దశాబ్ద కాలంగా బిఆర్ఎస్ నియంతృత్వం పాలన నుండి తెలంగాణకు విముక్తి లభించింది అన్నారు. ప్రగతి భవన్ గేట్లు తెరుచుకున్నాయి కంచెలు తెగినయి ప్రజలు ప్రజాపాలనను చూడబోతున్నారంటూ పేర్కొన్నారు. కెసిఆర్ పాలనలో తెలంగాణ అప్పుల పాలయిందని చెప్పారు ఒక్క విద్యుత్ శాఖలోనే 85 వేల కోట్ల అప్పులు చేశారని స్పష్టం చేశారు అలాగే మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి చేసిన సమీక్ష సమావేశంలో పౌరసరఫరాల శాఖ 56 వేల కోట్ల రూపాయల అప్పు చేసినట్లు పేర్కొన్నారు. వీటిని చూస్తుంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై నివేదిక ఇవ్వాలంటూ అన్ని శాఖల అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. పరిస్థితులు ఎలా ఉన్నా కాంగ్రెస్ ను నమ్ముకొని అధికారం ఇచ్చిన ప్రజల మనసులు చూరగోనెల పాలన అందిస్తామని స్పష్టం చేశారు. 6 గ్యారంటీలలో రెండు గ్యారెంటీలను ఇప్పటికే అమలు చేసిన గొప్ప మనసున్న నేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే

ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అన్నట్లు రాజకీయంగా భిక్ష పెట్టిన కరీంనగర్ గడ్డకు ఎప్పుడు రుణపడి ఉంటానని తెలిపారు. ఎన్ ఎస్ యు ఐ నాయకుని నుండి మంత్రిగా అవకాశం కల్పించిన కరీంనగర్ జిల్లా ప్రజల రుణం తీర్చుకోలేనిది అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు ప్రతిపక్ష పార్టీ ఐదుగురు ఎమ్మెల్యేలను కలుపుకొని జిల్లా అభివృద్ధి కోసం పాటుపడతానని వెల్లడించారు. రాజకీయంగా పునర్జన్మనిచ్చిన హుస్నాబాద్ ప్రజల కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కరీంనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ పురుమల్ల శ్రీనివాస్ హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి ప్రణవ్ బాబు కరీంనగర్ సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి రాష్ట్ర మీడియా స్పోక్స్ పర్సన్ రోహిత్ రావు నాయకులు అంజన్ కుమార్ యాదవ్ పద్మాకర్ రెడ్డి తో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.