కాంగ్రెస్ తేనే ప్రజాసంక్షేమం సాధ్యం..

కాంగ్రెస్ తేనే ప్రజాసంక్షేమం సాధ్యం..
  • ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తుంది..
  • ప్రజా దీవెన యాత్రలో గండ్ర సత్యనారాయణ రావు..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి:కాంగ్రెస్ పార్టీతేనే ప్రజాసంక్షేమం సాధ్యమవుతుందని, అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తుందని టీపీసీసీ సభ్యుడు,  భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. జయశంకర్ జిల్లా భూపాలపల్లి మండలంలోని ఆజంనగర్, నాగారం, రాజీవ్ నగర్, పంబాపూర్, నందిగామ, దీక్షకుంట, దూదేకులపల్లి, గొల్లబుద్దారం గ్రామాలలో ఆదివారం ప్రజా దీవెన యాత్ర సాగింది. అంతకుముందు రేగొండ మండలం కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో, భూపాలపల్లి పట్టణంలోని హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అక్కడ నుండి ఆజంనగర్ గ్రామానికి భారీ కాన్వాయ్ తో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అయిత ప్రకాష్ రెడ్డి, ఇటీవలె కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మావోయిస్టు నేత గాజర్ల అశోక్ అలియాస్ ఐతు లతో వెళ్లి ప్రజాదీవెన యాత్రను ప్రారంభించారు. ఆయా గ్రామాల్లో జరిగిన ప్రజాదీవెన యాత్రలో సత్యనారాయణ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీ లతో పాటు ఇచ్చిన అన్ని హామీలను అమలు పరుస్తుందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఆరు గ్యారంటీల భయం పట్టుకుందని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తొమ్మిదిన్నర ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో పోడు భూముల రైతులకు ఒరిగిందేమీ లేదని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పోడు భూముల రైతులకు పట్టాలు ఇచ్చిన ఘనత ఉందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే పోడు భూములు దున్నుకునే రైతులకు పట్టాలు ఇస్తామని అన్నారు.

భూపాలపల్లిలో బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే డబ్బులు గెలిచినట్టు, నేను గెలిస్తే భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలు గెలిచినట్లని ఆయన పోల్చారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుందని గృహలక్ష్మీ, దళిత బందు, వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి, ప్రజలను బీఆర్ఎస్ పార్టీ మోసం చేసిందని ఎద్దేవా చేశారు. ప్రజా శ్రేయస్సు ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని, రాబోయే అన్ని ఎన్నికల్లోనూ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీయేనని, అందుకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపుకు యువత కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆయా గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్, బీజేపీ ఇతర పార్టీలకు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరగా, వారికి గండ్ర సత్యనారాయణ రావు కాంగ్రెస్ పార్టీ  కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి రూరల్ మండల అధ్యక్షుడు సుంకరి రామచంద్రయ్య, టిపిసిసి సభ్యులు చల్లూరి మధు, సీనియర్ నాయకుడు బుర్ర కొమురయ్య, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గుమ్మడి శ్రీదేవి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బండ శ్రీకాంత్, ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, వివిధ మండలాల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.