వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే..

వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే..
  • బీఆర్ఎస్ కు ఏజెంటులా పనిచేసిన అధికారులను వదిలేది లేదు.
  • కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావు..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి:కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని, వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని  కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. భూపాలపల్లి జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్, టిపిసిసి సభ్యుడు చల్లూరి మధు, వైఎస్ఆర్టీపి జిల్లా అధ్యక్షుడు అప్పం కిషన్ తదితర ముఖ్య నాయకులతో కలిసి ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ గెలుపు కొరకు కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. గడిచిన కొన్ని నెలలుగా ఎన్నో వ్యయ ప్రయాసాలకోర్చి, పగలనక, రాత్రనక కష్టపడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు నిరంతరం శ్రమించి, సహకరించారని తెలిపారు.

తెలంగాణ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ లో ఎక్కువ సంస్థలు కాంగ్రెస్ కే పట్టం కట్టాయని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తుందన్నారు. గడిచిన పదేళ్లలో అడుగడుగునా అణచివేతలు, దాడులు, కేసులకు వెరవకుండా కాంగ్రెస్ చేసిన పోరాటంలో మీరంతా ప్రజల పక్షాన నిటారుగా, నికార్సుగా నిలబడ్డారని ఈ సందర్భంగా కొనియాడారు. మీ కష్టం, శ్రమ వృథా కాలేదన్నారు. భూపాలపల్లిలో కూడా కాంగ్రెస్ పార్టీయే భారీ మెజారిటీతో గెలువబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక్కడ కొంతమంది ప్రభుత్వ అధికారులు బీఆర్ఎస్ పార్టీకి ఏజెంట్ గా పనిచేస్తున్నారని, వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేదిలేదన్నారు. అధికారులు ప్రజలకు జవాబుదారీగా  ఉండాలే కానీ, ఏకపక్షంగా వ్యవహరించి ప్రజలను భయబ్రాంతులకు గురిచేయడం సరైన పద్ధతి కాదని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ పిప్పాల రాజేందర్, పట్టణ కౌన్సిలర్లు కురిమిళ్ళ రజిత శ్రీనివాస్, నాయకులు క్యాతం సాంబమూర్తి పాల్గొన్నారు.