జయశంకర్ జిల్లాలో గాలివాన బీభత్సం..

జయశంకర్ జిల్లాలో గాలివాన బీభత్సం..
  • కూలిన చెట్లు, తెగిపడిన విద్యుత్ తీగలు..
  • అంధకారంలో గ్రామాలు..
  • పంటలకు తీవ్ర నష్టం..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆదివారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది వివిధ మండలాల్లో చెట్లు నేలకూలాయి విద్యుత్ తీగలు తెగిపడ్డాయి పలువురు ఇంటి పైకప్పు  రేకులు లేచిపోయి ధ్వంసమయ్యాయి. కురిసిన వర్షంతో పంటలకు తీవ్రంగా నష్టం వాటిల్లింది జిల్లా వ్యాప్తంగా 354.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో అత్యధికంగా భూపాలపల్లి మండలంలో 68.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా అత్యల్పంగా పలిమెల మండలంలో 10.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పలు మండలాల్లో సోమవారం రాత్రి ఒక్కసారిగా గాలివాన రావడంతో  చెట్లు విరిగిపడ్డాయి. దీంతో విద్యుత్ తీగలు తెగిపోయాయి. రోడ్డుకు అడ్డంగా చెట్లు పడడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్నిచోట్ల ఇళ్లపై చెట్లు విరిగి పడడంతో ఇండ్లు ధ్వంసమయ్యాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో గ్రామాలన్నీ అంధకారంలో ఉండిపోయాయి. 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని చల్లగరిగలో గాలివాన బీభత్సానికి వాటర్ ప్లాంట్ భవనంపై విరిగిపడిన చెట్టు.

పంటలకు తీవ్రంగా నష్టం..

గాలివాన బీభత్సానికి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వరి, మొక్కజొన్న, మిర్చి పంటలకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. కల్లాల్లో ఆరబోసిన మిరపకాయలు, వరి ధాన్యం తడిసి ముద్దయింది. మొక్కజొన్న, వరి పంటలు నేల వాలడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటలు చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలు వరుసగా కురుస్తుండడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.

గాలి వాన బీభత్సానికి స్కూల్ ఆడిటోరియం పైకప్పు రేకులు లేచిపోయిన దృశ్యం..