దేశ సంపదను ఆదానీకి కట్టబెడుతున్న మోదీ..

దేశ సంపదను ఆదానీకి కట్టబెడుతున్న మోదీ..
  • అధికారంలోకి రాగానే తెలంగాణలో ఆరు గ్యారంటీలను అమలు చేస్తాం..
  • కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలకు న్యాయం..
  • ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: బీజేపీ ప్రధాని మోదీ దేశ సంపదను ఆదానీకి కట్టబెడుతున్నాడని ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. ములుగు జిల్లా రామంజపురంలో బహిరంగ సభ అనంతరం జయశంకర్ భూపాలపల్లికు చేరుకున్న రాహుల్ గాంధీ చెల్పూరులోని జెన్కో సముదాయంలో నిద్ర చేశారు. గురువారం భూపాలపల్లి జిల్లా కేంద్రం నుండి భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించి కాటారం చేరుకున్నారు. కాటారంలోని ముఖ్యకూడలి వద్ద రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఈ రాష్ట్ర సమాజం ప్రజా తెలంగాణను కోరుకుంది కానీ, ప్రస్తుతం తెలంగాణ కేవలం ఒక కుటుంబం చేతిలో బందీ అయిపోయిందని స్పష్టం చేశారు.

బీఆరెస్, బీజేపీ, ఎంఐఎంలు  కాంగ్రెస్ ను ఓడించేందుకు కుట్ర చేస్తున్నాయని, అలాంటి వారికి బయపడేదిలేదని తేల్చి చెప్పారు. సీబీఐ, ఈడీ కేసులతో బీజేపీ విపక్షాలను భయపెడుతున్నదని, కేసీఆర్ పై మాత్రం ఈడీ, సీబీఐ కేసులు ఎందుకు వేయడం లేదని ప్రశ్నించారు. బీజేపీ చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు తాను వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే నాపై ఎందుకు కేసులు పెట్టారని, లోక్ సభ సభ్యత్వం ఎందుకు రద్దు చేశారని విమర్శించారు.  కేసీఆర్ నిజంగా బీజేపీకి వ్యతిరేకంగా పోరాడితే ఆయనపై ఎందుకు ఈడీ, సీబీఐ కేసులు పెట్టలేదని ప్రశ్నించారు. ముమ్మాటికీ బీజేపీ, బీఆరెస్ ఒక్కటేనని, ఎంఐఎం బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం ఎందుకు చేయడంలేదనేది కూడా ప్రజలు అర్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దేశవ్యాప్తంగా ఆ పార్టీకి బీజేపీకి పరోక్ష మద్దతు ఇస్తోందని, ఎంఐఎం ఎక్కడ ఏ అభ్యర్థులను పెట్టాలో బీజేపీ నే నిర్ణయిస్తోందని వివరించారు. బీజేపీ బీఆరెస్ కు, బీఆరెస్ బీజేపీ కి ఒకరికొకరు సహకటించుకుంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని తెలియజేశారు. అన్ని వర్గాలకు న్యాయం జరుగాలంటే దేశంలో కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. కులగణన దేశానికి ఎక్స్ రే లాంటిదని, దానితోనే దేశంలో వివిధ వర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతాయని చెప్పారు. దేశంలోని అధికారుల్లో ఎంత మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ ఆధికారులున్నారని పార్లమెంట్ లో ప్రశ్నించడం జరిగిందని, కేవలం 5శాతం మంది మాత్రమే ఆ వర్గాలకు చెందిన అధికారులు ఉన్నారని వివరించారు. దేశం అభివృద్ధి చెందాలంటే అన్ని వర్గాల వారిని భాగస్వాములను చేయాల్సిందేనని తెలిపారు. ఆదానీ వివిధ సంస్థల్లో  లక్షలాది కోట్ల రూపాయలు తీసుకుంటే అడగకముందే మాఫీ చేస్తున్నారని, కానీ ఒక రైతు రుణాన్ని, కార్మికుల అప్పును,  స్వయం ఉపాధి లోన్లు మాత్రం మాఫీ చేయడం లేదని ఇది ఎంతవరకు సమంజసమన్నారు. రాజస్థాన్, ఛత్తీస్ గడ్, కర్నాటక లో ఇచ్చిన హామీలను అమలు చేయడం జరిగిందని తెలంగాణలో ఇచ్చిన హామీలను కూడా ఖచ్చితంగా అమలు చేసి అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి పాటుపడతామని రాహుల్ గాంధీ తెలియజేశారు. 
- తెలంగాణ ఉద్యమంలో కార్మికుల పాత్ర మరువలేనిది..
- టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి..

తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికుల పాత్ర మరువలేనిదని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. భూపాలపల్లిలోని  1వ ఇంక్లైన్ వద్ద గురువారం ఉదయం ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్ లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. అన్ని జెండాలను ఎజెండాలను పక్కనబెట్టి పోరాడితేనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కల సాకారమైందని, కార్మీకుల త్యాగాన్ని బీఆరెస్ ప్రభుత్వం మరిచిపోయిందన్నారు. 

కార్మికుల వైపు ఉన్నామనేది వాళ్లే, ప్రభుత్వంలో ఉన్నది వాళ్లేనని, సమస్యలు పరిష్కరించకుండా జాప్యం చేస్తున్నది వాళ్లే అనేది గుర్తుంచుకోవాలన్నారు. ఒకే ఒక్క అధికారిని సింగరేణికి పెట్టి, దివాళా తీయించారని, ఇప్పటికీ ఆ తప్పులను కప్పిపుచ్చుకుంటున్నారని ఆరోపించారు. సింగరేణిని ప్రయివేటు పరం చేయడంలో బీఆరెస్ ఒప్పుకుంది నిజం కాదా అని ప్రశ్నించారు. అరబిందో కు మైన్ అప్పగించి, తాడిచర్ల మైన్ ను వారి అనుయాయులకు అప్పగించి, 

నైని కోల్ మైన్ ను ఆదానీకి కట్టబెట్టాలని చూసింది నిజం కాదా అని ప్రశ్నించారు. మైన్ ను ప్రయివేట్ పరం చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ అడ్డుకున్నదని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని హామి ఇచ్చారు. సింగరేణి ఎన్నికలను జరుపకుండా కేసీఆర్ ఎందుకు తప్పించుకుంటున్నారని, జెన్ కో బిల్లులు కట్టి ఉంటే, ఓపెన్ కాస్ట్ మైన్ లు ప్రయివేటు పరం చేయకుండా ఉంటే ఎన్నికలు జరిపేవారు కాదా అని మండిపడ్డారు. డిసెంబర్ 27న సింగరేణి ఎన్నికలు జరగాలంటే డిసెంబట్ 3న కాంగ్రెస్ అధికారంలోకి రావాలని, తెలంగాణ సాధించిన కార్మికులుగా మిమ్మల్ని గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకుందని తెలియజేశారు. 

తెలంగాణను గుల్ల చేసిన ఈ రాష్ట్రంలోని పందికొక్కుల పని పట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కార్మికుల సమస్యలు యుద్ధ ప్రాతిపదికన పరిష్కరిస్తుందని, అన్నివర్గాల సంక్షేమానికి పాటు పడేది కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనని వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థులు గండ్ర సత్యనారాయణ రావు, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, మధుయాష్కీ, పొంగులేటి తదితరులు పాల్గొన్నారు.