మునుగోడు గడ్డ.... బహుజనుల అడ్డా

మునుగోడు గడ్డ.... బహుజనుల అడ్డా

మునుగోడు,  ముద్ర:  మునుగోడు గడ్డ... బహుజనుల అడ్డా అని, మునుగోడు బీఆర్ఎస్ టికెట్ పై ముఖ్యమంత్రి కేసీఆర్ పున రాలోచించాలని ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు  వెలుగు రవి అన్నారు.  మంగళవారం మునుగోడు మండల కేంద్రంలోని  మనీ గార్డెన్ లో మునుగోడు నియోజకవర్గం ముదిరాజ్ సంఘం నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెలుగు రవి  మాట్లాడుతూ  ఈ నియోజకవర్గంలో బీసీ ఎస్సీ, ఎస్టీ   మైనార్టీల ఓట్లు కీలకంగా ఉంటాయని, బీసీల టికెట్ పై  బీఆర్ఎస్ మరొకసారి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని అన్నారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్ ముదిరాజ్ ఓట్లను గుర్తించనప్పుడు  ఆ  పార్టీకి ఎందుకు ఓటు వేయాలని అన్నారు. ఎన్నో సంవత్సరాల నుండి ఈ నియోజకవర్గంలో బీసీలు బలంగా ఉన్నప్పుడు బీసీలకు ఎందుకు టికెట్ ఇవ్వరని అడిగారు.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో బీసీలు ఏకతాటిపైకి  వస్తారని,  బీసీలకు టికెట్ ఇవ్వని పార్టీలకు ప్రజలుతగిన బుద్ధి చెప్పడం ఖాయమని  అన్నారు.  నియోజకవర్గంలో ముదిరాజుల ఓట్లు 33,500 ఓట్లు ఉన్నాయని, ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ మునుగోడు టికెట్ ఫై పునరాలోచన  చేయకపోతే  బీఆర్ఎస్ పార్టీకి ఓటమి తప్పదని  అన్నారు. త్వరలోనే మునుగోడు నియోజకవర్గం ముదిరాజుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటుచేసి, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీలకతీతంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలని కలుపుకొని  ఉమ్మడి అభ్యర్థిని నిలపాలని తీర్మానించనున్నట్లు తెలిపారు.