నేషనల్ అవార్డు తీసుకోవాలని కోరిక ఉండేది..

నేషనల్ అవార్డు తీసుకోవాలని కోరిక ఉండేది..
  • ఆస్కార్ అవార్డుతో అది తీరింది..
  • గ్రామంలో గ్రంథాలయ భవన నిర్మాణం కట్టిస్తా..
  •  ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్..
  • చల్లగరిగలో ఘనంగా జరిగిన అభినందన సభ..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి:  సినీ పరిశ్రమలో రాసిన పాటలకు అనేక అవార్డులు వచ్చినప్పటికీ, నేషనల్ అవార్డు తీసుకోవాలని కోరిక తనలో ఉండేదని, ఆస్కార్ అవార్డు రావడంతో ఆ కోరిక తీరిందని ప్రముఖ సినీ గేయ రచయిత కనుకుంట్ల చంద్రబోస్ అన్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ స్వగ్రామమైన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగలో  పూర్వ విద్యార్థులు, గ్రామస్తుల ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటుచేసిన అభినందన, సన్మాన సభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు, బంధుమిత్రులు, వివిధ గ్రామాల ప్రజలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆస్కార్ అవార్డు గ్రహీత, సినీ గేయరచయిత చంద్రబోస్ ను శాలువాలు, పూలమాలలు, మెమొంటోలతో ఘనంగా సన్మానించారు.

ఆయన రాసిన పాటలు, వచ్చిన అవార్డులపై పలువురు వక్తలు వివరిస్తూ కొనియాడారు. అనంతరం చంద్రబోస్ మాట్లాడుతూ త్రిబుల్ ఆర్ సినిమాలో రాసిన 'నాటు నాటు' పాట పల్లెటూరి నుండి పుట్టిందేనని ఈ ప్రాంత పరిస్థితులను బట్టి పాటలు రాయడం జరిగిందన్నారు. ఈ పాటకు అవార్డు రావడం సంతోషంగా ఉందని, ఈ అవార్డును తన సతీమణి సుచిత్రకు అంకితం ఇస్తున్నానని సభాముఖంగా చెప్పారు. ఇలాంటి పాటలు మరిన్ని రాస్తానని తెలియపరిచారు. తనకు పురస్కారం వచ్చిందని తెలియజేయడానికి ఇక్కడికి రాలేదని తనలాగా ప్రతి ఒక్కరు కష్టపడి పట్టుదలతో అన్ని రంగాల్లో రాణించాలని, ఆర్థికంగా ఎదగాలని ఆయన సూచించారు.

- గ్రంథాలయ భవన నిర్మాణం చేయిస్తా..

తాను పుట్టిన చల్లగారిగ గ్రామానికి తనవంతుగా సహాయం చేస్తానన్నారు. ఇదివరకే సహాయ సహకారాలు అందించడం జరిగిందని, గ్రామంలో ఉన్న గ్రంథాలయ భవనం శిథిలావస్థకు చేరిందని ఆ భవనాన్ని కూల్చివేసి అదే స్థలంలో నూతన భవన నిర్మాణాన్ని ఎంత ఖర్చు అయినా నిర్మిస్తానని హామీ ఇచ్చారు. భవన నిర్మాణ విషయంలో చిన్ననాటి స్నేహితులకు బాధ్యతలు అప్పగించి త్వరితగతిన పనులు చేపట్టేలా కృషి చేస్తానని చంద్రబోస్ ఈ సందర్భంగా తెలియజేశారు.

- చంద్రబోస్ కు స్వగ్రామంలో ఘనస్వాగతం..
- ర్యాలీలో బాణా సంచాలు కాల్చుతూ, పూలు చల్లుతూ సంబురాలు..

 చల్లగరిగలో ఏర్పాటు చేసిన అభినందన సభకు విచ్చేసిన ప్రముఖ సినీ గేయరచయిత చంద్రబోస్ కు పూర్వవిద్యార్థులు, గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు. చల్లగరిగకు చేరుకున్న చంద్రబోస్, సుచిత్ర దంపతులు ముందుగా గ్రామంలోని శివాలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం శివాలయం నుండి స్థానిక హైస్కూల్ లో ఏర్పాటు చేసిన అభినందన సభ వరకు అభిమానులు, బంధుమిత్రులు, గ్రామస్థుల సమక్షంలో ర్యాలీగా వెళ్లారు. ఈ సందర్భంగా కోలాటాలు, బ్యాండ్ మేళాల మధ్య చంద్రబోస్ ర్యాలీ ఘనంగా సాగింది.

అభిమానులు బాణాసంచాలు కాల్చుతూ, స్వీట్లు పంచుతూ పండుగ వాతావరణంలో కార్యక్రమాన్ని  నిర్వహించారు. అనంతరం అభినందన సభవేదిక పైకి వచ్చిన చంద్రబోస్ ముందుగా స్వర్గీయ తన తల్లి మధునమ్మ చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దావో వినోద వీరారెడ్డి, స్థానిక సర్పంచ్ కర్రె మంజుల అశోక్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ కుంభం క్రాంతి కుమార్ రెడ్డి, ఎస్ఎంసి చైర్మన్ ప్రభాకర్, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు, వివిధ గ్రామాల ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.