కారు ప్రమాదంలో సీనియర్ బిఆర్ఎస్ నాయకుని మృతి

కారు ప్రమాదంలో సీనియర్ బిఆర్ఎస్ నాయకుని మృతి

మహాదేవపూర్, ముద్ర: రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు బండం లక్ష్మారెడ్డి (51) శుక్రవారం తెల్లవారుజామున కారు ప్రమాదంలో మరణించారు. ఈయనకు ఇద్దరు సంతానం. కుమారుడు అమెరికాలో ఉద్యోగం చేస్తుండగా కుమార్తెకు వివాహం చేశారు. మహాదేవపూర్ మండలం బొమ్మాపూర్ గ్రామానికి బండం లక్ష్మారెడ్డి టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుండి బిఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. బండం లక్ష్మారెడ్డి సతీమణి పుష్పలత మండల పరిషత్ ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్నారు. ఆరుగురు బంధు వర్గంతో కలసి బండం లక్ష్మారెడ్డి తన కుమారుని వివాహ సంబంధము పనిమీద గుంటూరు వెల్లి తిరిగి వస్తుండగా నాలుగు గంటల సమయంలో ఆయన ప్రయాణిస్తున్న కారు భూపాలపల్లి దాటిన తర్వాత పల్టీ కొట్టింది. కారులో ఉన్న మిగతా వ్యక్తులు స్వల్ప గాయాలతో బయటపడగా బండం లక్ష్మారెడ్డి తలకు తీవ్ర గాయమవ్వడంతో అక్కడికక్కడే మృతి చెందారు.

కారులో సేఫ్టీబెల్ట్ బిగించుకోని కారణంగా బెలూన్ లు తెరుచుకోకపోవడంతో ఈ విషాదం సంభవించినట్లు తెలుస్తోంది. ఆయన మరణ వార్త తెలిసిన వెంటనే మండలంలోని పలు గ్రామాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, బంధువులు, మిత్రులు పెద్ద ఎత్తున భూపాలపల్లికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం ఆయన భౌతికకాయాన్ని బొమ్మాపూర్ గ్రామానికి తరలించారు. ప్రస్తుతము రైతుబంధు మండల పరిషత్ అధ్యక్షుడుగా కొనసాగుతున్న బండం లక్ష్మారెడ్డి మంథని మాజీ ఎమ్మెల్యే జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ కు అత్యంత సన్నిహితుడు. బిఆర్ఎస్ పార్టీలో అత్యంత కీలకమైన నేతగా ఆయనకు పేరుంది. రెండుసార్లు మహాదేవపూర్ ఎంపీపీ పదవిని పుట్ట మధు కోరిక మేరకు త్యాగం చేశారు. భూపాలపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ భౌతికకాయాన్ని సందర్శించారు. పార్టీ అధ్యక్షులు లింగంపల్లి శ్రీనివాసరావు, కాటారం మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు పెండ్యాల మమత, సీనియర్ నాయకులు వెన్నపురెడ్డి మోహన్ రెడ్డి, పెండ్యాల మనోహర్, ఆన్కారి ప్రకాష్, మహాదేవపూర్ సర్పంచ్ శ్రీపతి బాబు, సర్పంచ్ ఓడెటి పద్మ, రవీందర్ రెడ్డి, పార్టీ పర భేదం లేకుండా పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీల నాయకులు, బంధువులు ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.