కాంగ్రెస్, బిజెపిలతో లాభం లేదు

కాంగ్రెస్, బిజెపిలతో లాభం లేదు
  • మంత్రి హరీష్ రావు
  • నర్సాపూర్ లో అట్టహాసంగా సునీతా రెడ్డి నామినేషన్

ముద్ర ప్రతినిధి, మెదక్:కాంగ్రెస్, బిజెపిలతో లాభం లేదని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ లో బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధిగా వి. సునీతా లక్ష్మారెడ్డి నామినేషన్ ర్యాలీలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ప్రజలనుద్దేశించి మంత్రి మాట్లాడుతూ...ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కేసీఆర్ సంక్షేమ ఫలాలను అందిస్తున్నారని పేర్కొన్నారు. 11 సార్లు కాంగ్రెస్ కు అవకాశం ఇస్తే ఏమి చేయలేదు, బిజెపికి ఈసారి డిపాజిట్లు కూడా రావన్నారు. బిజెపి డక్ అవుట్, కాంగ్రెసు రన్ అవుట్, కెసిఆర్ సెంచరీ తప్పదని ధీమా వ్యక్తం చేశారు. కొడంగల్ లో ఓడిపోతే రేవంత్ రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నాడు, కాంగ్రెస్ గెలవకపోతే ఉత్తంకుమార్ రెడ్డి గడ్డం తీసుకోను అన్నాడు...

రైతు బంధును వేయకుండా ఈసీకి ఫిర్యాదు చేసి కాంగ్రెస్ పార్టీ అడ్డుకునే ప్రయత్నం చేసిందని, రేవంత్ రెడ్డి రైతులను బిచ్చగాళ్లంటున్నడని ద్వజమెత్తారు. కటిక చీకటి కాంగ్రెస్ పాలన కావాలా? 24 గంటలు కరెంట్ ఇస్తున్న కేసీఆర్ పాలన కావాలా? అని ప్రశ్నించారు. ఇంటింటికీ మంచినీళ్లు, పింఛన్లు, తండాలను గ్రామ పంచాయితీలు, రోడ్లను వేసిన కేసీఆర్ చేతిలో తెలంగాణ భద్రంగా ఉంటుందన్నారు. బీజేపీలకు ఎందుకు ఓటెయ్యాలి? సిలిండర్ల ధరలు పెంచినందుకా? మోటార్ల కాడ మీటర్లు పెట్టి రైతుల చేతిలో బిల్లు పెట్టమన్నందుకా? అన్నారు. 

28 లక్షల మోటర్లు ఉన్న రైతులు కెసిఆర్ ను కాదని ఇతర పార్టీలకు ఓటు వేయరని పేర్కొన్నారు. బీఆర్ఎస్ గెలిస్తే పింఛన్లు 5 వేలకు పెంచి, సన్న బియ్యం ఇస్తామన్నారు. బిఆర్ఎస్ గెలుపుకై ప్రతి కార్యకర్త కృషి చేయాలని, సునీతా రెడ్డి గెలిస్తే నర్సాపూర్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తారన్నారు.  కాంగ్రెస్ నుండి పోటీ చేసే అభ్యర్థి ఇప్పటివరకు సర్పంచి కూడా కాలేదన్నారు. రాష్ట్రంలో గెలిచేది బీఆర్ఎస్ పార్టీ, ఇతర పార్టీలు గెలిస్తే అభివృద్ధి జరగదన్నారు. 

ఎవరెన్ని చేసినా మళ్లీ వచ్చేది కేసీఆరే అన్నారు. కెసిఆర్ తో ఉన్న అనుబంధంతో మదన్ రెడ్డి మంచి అభివృద్ధి చేశాడు,  రేపు గెలిస్తే ఇద్దరూ అభివృద్ధికై కృషి చేస్తారన్నారు. 65 కోట్ల రూపాయలు నర్సాపూర్ అభివృద్ధికై కేసీఆర్ మంజూరు చేశారన్నారు. సునీతా రెడ్డిని ఎమ్మెల్యే చేయండి, మదన్ రెడ్డిని ఎంపీ చేసే బాధ్యత నాదని మరోసారి మంత్రి ప్రకటించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు చంద్రగౌడ్ తదితరులున్నారు.