పలిమెలలో 70 లక్షలతో కార్యాలయాల కాంప్లెక్స్: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా  

పలిమెలలో 70 లక్షలతో కార్యాలయాల కాంప్లెక్స్: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా  

మహాదేవపురం, ముద్ర:పలిమెల మండలానికి మంజూరైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రజలకు తోరతగతిన అందుబాటులోకి తీసుకుని వచ్చేలా చర్యలు తీసుకోవాలని  జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులకు సూచించారు. గ్రామకంఠంలో  ఎంపిక చేసిన భూమిని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా  పరిశీలించారు. ఎకరం భూమిని గుర్తించి హద్దులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ తహసిల్దారును ఆదేశించారు.టెండర్లను త్వరలో పిలుస్తామని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణం పూర్తయితే ఇక్కడే నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని కలెక్టర్ తెలిపారు.


పలిమెల మండలంలో 70 లక్షలతో మండల కార్యాలయాల కాంప్లెక్స్  నిర్మించి ప్రభుత్వ కార్యాలయాలను ఇక్కడ ఏర్పాటు చేస్తామని కలెక్టర్ తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ కే.జీ.బీ.వీ పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజనం చేసి వంటలు రుచి చూశారు. విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన భోజనం అందజేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. అనంతరం కే.జీ.బీ.వీ పాఠశాలలోని విద్యార్థులకు కలెక్టర్ ఫిజిక్స్ పాఠాలు బోధించారు. ఈ కార్యక్రమంలో  కాటారం అర్డిఓ డా.నారాయణ, డిఎంహెచ్ఓ డా. మధుసూదన్, డిఈఓ రామ్ కుమార్, పలిమెల ఎంపిపి బుచ్చక్క, సర్పంచులు పుష్పలత, శ్రీను సంబంధిత అధికారులు పాల్గొన్నారు.