సవాళ్లను స్వీకరిస్తున్న కేసీఆర్ ను రమ్మను

సవాళ్లను స్వీకరిస్తున్న కేసీఆర్ ను రమ్మను
  • గంగుల... డబ్బు పంచలేదని ప్రమాణం చేస్తావా
  • మనస్సాక్షిగా ఓటు వేయండి
  • కరీంనగర్ బిజెపి అభ్యర్థి బండి సంజయ్

ముద్ర ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్ధి గంగుల కమలాకర్ సవాల్ ను స్వీకరిస్తున్నట్లు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అసెంబ్లీ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. ‘‘నేను ఓటర్లకు డబ్బులు పంచలేదని తడిబట్టలతో ప్రమాణం చేసేందుకు సిద్ధం. అదే సమయంలో నువ్వు (గంగుల) ఓటర్లకు డబ్బులు పంచినట్లు కూడా ప్రమాణం చేసేందుకు రడీగా ఉన్నా. హైదరాబాద్ లోని భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం వద్దకైతే ముఖ్యమంత్రి కేసీఆర్ ను తీసుకురా అని కరీంనగర్ బిజెపి అభ్యర్థి బండి సంజయ్ ప్రతి సవాల్ విసిరారు. కరీంనగర్ లోనైతే నువ్వు, నీ కార్యకర్తలతో రా ఓటర్లకు డబ్బులు పంపించలేదని ప్రమాణం చేసే దమ్ముందా? అట్లాగే కొత్తపల్లిలో డబ్బులు పంచిన బీఆర్ఎస్ నాయకులను చూపిస్తా వాళ్లతో కూడా ప్రమాణం చేయించే సత్తా ఉందా?’’అని అన్నారు.

ఈ మేరకు ఎక్స్ ద్వారా పోస్ట్ చేశారు. అనంతరం మీడియాకు విడుదల చేసిన ప్రకటన లో పేర్కొంటూ ‘‘ధర్మం ధైర్యంగా ప్రశ్నిస్తుంది... అధర్మం అభద్రతతో పారిపోతుంది. నువ్వు ఓటమి భయంతో ఓటర్లకు డబ్బు కట్టలు ఎర వేస్తున్నావు. అడ్డంగా దొరికి అడ్డగోలుగా అసత్యాల ప్రచారం చేస్తున్నావు. నిజం ఒప్పుకోలేక సిగ్గు వదిలి నువ్వు చేస్తున్న ఎదురు విమర్శలు ప్రజలు గమనిస్తున్నారు అన్నారు. దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా ఉంది అని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణేతలు మీరే. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు చరమ గీతం పాడండి. డబ్బులు, ఇతర ప్రలోభాలకు లొంగకండి. మనస్సాక్షి ప్రకారం మీకు నచ్చిన వారికి ఓటేయండి. ధర్మాన్ని నిలబెట్టండి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ చేస్తున్న ప్రయత్నాలకు ప్రతి ఒక్కరూ సహకరించండి’’ అని పిలుపునిచ్చారు. మరోవైపు బండి సంజయ్ పోలింగ్ ముందురోజైన బుధవారం ఆహ్లదకర వాతావరణంలో కార్యకర్తలు, ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులతో సరదాగా గడిపారు.