భారత్​లో తగ్గిన పేదరికం

భారత్​లో తగ్గిన పేదరికం
  • యూఎన్​డీపీ, ఆక్స్​ఫర్డ్​నివేదిక
  • 41.5 కోట్ల మందికి విముక్తి

ముంబై: భారత్​లో 2005–06 నుంచి 2019–21 మధ్య 15 సంవత్సరాల్లో 41.5 కోట్ల మంది పేదరికం నుంచి విముక్తి పొందారని యూనైటెడ్​ నేషన్స్​ నివేదిక వెల్లడించింది. యూఎన్​డీపీ (యూనైటెడ్​ నేషన్స్​ డెవలప్​మెంట్​ప్రొగ్రెస్​), ఆక్స్​ఫర్డ్​విశ్వవిద్యాలయం సంయుక్తంగా బీదరికంపై చేపట్టిన సర్వేలో ఈ విషయం స్పష్టమైనట్లు తాజాగా నివేదిక వెల్లడించింది. అన్ని దేశాల కంటే నిరుపేదల సంఖ్య భారత్​లో గణనీయంగా తగ్గిందని పేర్కొంది. భారత్​సహా మరో 25 దేశాలపై ఈ సంస్థలు నివేదికలను వెల్లడించాయి. వివిధ దేశాల్లోని ఆర్థిక వృద్ధి, నిరుపేదల స్థితిగతులపై సర్వే  నిర్వహించింది. ఇందులో కాంబోడియా, చైనా, కాంగో, హోండూరస్​, భారత్​, ఇండోనేషియా, మొరాక్కో, సెర్బియా, వియత్నాం దేశాలు కూడా ఉన్నాయి. భారత జనాభా ఏప్రిల్​లో 142.86 కోట్లని పేర్కొంది. ఈ జనాభా చైనా కంటే అధికమంది. భారత్​ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో మొదటి స్థానంలో ఉందని యూఎన్​డీపీ స్పష్టం చేసింది. పేదరికాన్ని తగ్గించేందుకు భారత్​తీసుకున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నట్లు వెల్లడించింది. భారత్​లో 2005–06 మధ్య చూసుకుంటే 64.5 కోట్ల మంది కడు బీదరికంలో బతుకీడుస్తున్నారని పేర్కొంది. అదే 2015–16 వచ్చే సరికి ఆ సంఖ్య 37 కోట్లుగా నమోదైందని వెల్లడించింది. 2019–21 మధ్య 21 కోట్ల నుంచి 23 కోట్లు మాత్రమే పేదరికాన్ని అనుభవిస్తున్నారని పేర్కొంది.

పోషక ఆహార పదార్థాలు తీసుకుంటున్న కుటుంబాలను పరిగణనలోకి తీసుకొని ఈ సంస్థలు ఈ నివేదికను రూపొందిస్తుంటాయి. ఈ నేపథ్యంలో చిన్నారుల మృతుల సంఖ్యను కూడా భారత్​ 4.5 శాతం నుంచి 1.5 శాతానికి తగ్గించగలిగించిదని పేర్కొంది. వంట చేసుకునేందుకు ఇంధనం (గ్యాస్) కూడా లేని వారు 52.9 శాతం నుంచి 13.9 శాతానికి తగ్గారని పేర్కొంది. ఈ సంఖ్య తమ నివేదిక ప్రకారం 2019–21 నాటికి 11.3 శాతంగా నమోదైందని పేర్కొంది. స్వచ్ఛ నీరు తాగుతున్నవారి సంఖ్య గతంలో 16.4 శాతంఆ ఉండేదని ప్రస్తుతం 2.7 శాతంగా ఉందని పేర్కొంది. ఇక విద్యుత్​లేని కుటుంబాలు 29 శాతంగా భారత్​లో ఉండేవని, ప్రస్తుతం ఆ సంఖ్య 2.1 శాతంగా నమోదైందని పేర్కొంది. ఇళ్లులేని వారు 44.9 శాతంగా గతంలో నమోదయ్యారని, ప్రస్తుతం ఆ సంఖ్య 13.6 శాతంగా నమోదైందని వెల్లడించింది. అంతర్జాతీయ సమాజంలో అనుకున్న లక్ష్యాలను చేరుకోవడంలో భారత్​ 19 దేశాల సరసన నిలిచిందన్నారు. ఈ 19 దేశాలు తమ అభివృద్ధికి లక్ష్యాలను నిర్దేశించుకొని అనుకున్న సమయంలో లక్ష్యాలను సాధించాయన్నారు. 110 దేశాల్లో 6.1 వందల కోట్ల ప్రజలలో 1.1 వందల కోట్ల ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువన బతుకీడుస్తున్నారని 2023లో నివేదిక వెల్లడించింది. ఇలాంటి వారి సంఖ్యలో దక్షిణాఫ్రికా అగ్రభాగాన ఉందని పేర్కొంది. ఇక్కడ 53.4 కోట్లమంది కడు బీదరికంలో బతుకీడుస్తున్నారని, 38.9 కోట్ల మంది దక్షిణ ఆసియాలో బీదరికంలో మగ్గిపోతున్నారని యూఎన్​డీపీ, ఆక్స్​ఫర్డ్​యూనివర్సిటీ సంయుక్త నివేదికలో ఆసక్తికర అంశాలను వెల్లడించింది.