మత రాజకీయాలు దేశానికి ప్రమాదం

మత రాజకీయాలు దేశానికి ప్రమాదం
  • ప్రభుత్వం 6 గ్యారంటీ పథకాలు అమలు చేయాలి
  • సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్క రాములు

ముద్ర ప్రతినిధి, మెదక్: దేశంలో బీజేపీ ప్రభుత్వం మత రాజకీయాలు చేస్తూ రాజకీయంగా లబ్ధి చేసుకోవాలని చూస్తుందని, ఈ విధానం దేశానికే ప్రమాదమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్క రాములు అన్నారు. శనివారం సీపీఎం మెదక్ జిల్లా విస్తృత స్థాయి సమావేశం కేవల్ కిషన్ భవనంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై సీపీఎం జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత పరమైన విధానాలు అధికారంలో ఉన్న ప్రభుత్వం నిర్వహించడం అనేది రాజ్యాంగ విరుద్ధమన్నారు. మొన్న జరిగిన అయోద్యనే ఉదాహరణ అని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వమే ప్రారంభించడం అనేది లౌకిక, ప్రజాస్వామ్య పరిరక్షణకు పూర్తి వ్యతిరేకం అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చెప్పి అధికారంలోకి వచ్చిన 6 గ్యారంటీ పటిష్టంగా అమలుచేయాలని, గత 3 రోజులుగా గ్రామాలలో తీసుకుంటున్న దరఖాస్తులో చాలా గందరగోళం ఉన్నదని గుర్తుచేశారు. ఏ అధికారిని అడిగినా పూర్తి విధివిధానాలు వారికే తెలియదని చెప్పడం సిగ్గు చేటన్నారు. ప్రభుత్వం ప్రజలకు సంబంధిన ధరఖాస్తులు తీసుకున్న ఎంతలోపు వారీ దరఖాస్తు పరిశీలించి అమలు చేస్తారో స్పష్టత లేదన్నారు. గ్రామాలలో అనేక మంది ప్రజలకు అవగాహన లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, వారికి ప్రభుత్వం నుండి స్పష్టత ఇవ్వాలని కోరారు. ప్రతి దానికి ఆధార్ కార్డు కచ్చితంగా కావాలని ప్రభుత్వం చెబుతున్న అందులో ఎదైనా తప్పిదాలు జరిగి ఉంటే కరెక్షన్ చేసుకోవాలని చూస్తే నెలల తరబడి తిరగాల్సి వస్తుందన్నారు. జిల్లాలో కచ్చితంగా కరెక్షన్స్ కోసం ఆధార్ సెంటర్లు పెంచడంతో చిన్న పిల్లలకి బయోమెట్రిక్, ఆధార్ కార్డుకు పోన్ నంబర్ లింక్, చిరునామా మార్చుకునే వారికి ఉపయోగకరంగా ఉంటుందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ.మల్లేశం, జిల్లా కార్యద్శివర్గ సభ్యులు నర్సమ్మ, మహేందర్ రెడ్డి, మల్లేశం, బస్వరాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు కడారి నాగరాజు, సంతోష్, సర్దార్, బగయ్య, నాయకులు బలమని, లచ్చాగౌడ్, బాబు, అజయ్, జగన్ తదితరులు పాల్గొన్నారు.