కలెక్టరేట్ ముందు సెకండ్ ఎఎన్ఎంల ధర్నా

ముద్ర ప్రతినిధి, మెదక్: తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ సెకండ్ ఎఎన్ఎంలు చలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టగా  అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ శనివారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. 

       రాష్ట్ర నాయకురాలు యాట సంగీత మాట్లాడుతూ...గత పదిహేను సంవత్సరాలుగా పిహెచ్సిలలో పనిచేస్తున్న సెకండ్ ఎఎన్ఎంలను పర్మినెంట్ చేయాలని లేదా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ప్రభుత్వానికి, అధికారులకు  విన్నవించినా ప్రభుత్వం నుండి  ఎటువంటి సహాయం లేదన్నారు. జులై 26న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1520 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. వాస్తవానికి 2018లో టిఎస్పీఎస్సీ నుండి విడుదల చేసిన నోటిఫికేషన్ లో 30 మార్కులు వచ్చేలా వెయిటేజీ ఇవ్వటం జరిగిందన్నారు. జులై 26న విడుదల చేసిన నోటిఫికేషన్ లో కేవలం 20 మార్కులు మాత్రమే ఇవ్వడం జరిగిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం విఆర్ఎలను పంచాయతీ కార్యదర్శులతో పాటు ఈ మధ్యకాలంలోనే ఆర్టీసీ ఉద్యోగులను కూడా ప్రభుత్వ పరం చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. కానీ కరోనా కష్టకాలంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్న మమ్మల్ని మాత్రం ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో మంది ఏఎన్ఎమ్ లు చనిపోయిన కానీ ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదన్నారు. వారి కుటుంబాలు రోడ్డున పడిపోయాయన్నారు.  ఏఐటియుసి ఆధ్వర్యంలో ఈనెల 4న ఇచ్చిన పిలుపుమేరకు చలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టగా  సుమారు 3500 మంది సెకండ్ ఏఎస్ఎమ్ లను అరెస్టు చేయడాన్ని ఖండించారు.  ప్రభుత్వం స్పందించి రెగ్యులర్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ధర్నాలో నాయకులు ప్రవీణ, దీవెన, సంతోష, కవిత, సునీత, దుర్గా, తులసి, రమ్య తదితరులు పాల్గొన్నారు.