‘మంథని’లో సరిలేరు ‘శ్రీధర్ బాబు’ కెవ్వరు

‘మంథని’లో సరిలేరు ‘శ్రీధర్ బాబు’ కెవ్వరు
  • 30475 ఓట్ల మెజారిటీతో గెలుపు
  • కాంగ్రెస్ కోటలో పనిచేయని ‘బీసీ కార్డు’
  • బోర్లా పడిన “బహుజన’ వాదం
  • లాభించిన ‘మేడిగడ్డ’ కుంగుబాటు 

మహాదేవపూర్, ముద్ర: నక్సల్స్ భావజాలంలో దశాబ్దాలుగా మగ్గిన ప్రాంతం, బీసీలు అత్యధికంగా ఉన్న ప్రాంతం, బహుజన వాదం ప్రచారంలో ఉన్న మంథని నియోజకవర్గంలో శ్రీపాదరావుకు రాజకీయ వారసుడుగా శ్రీధర్ బాబు ప్రస్తుత ఎన్నికలలో 30,475 వేల భారీ మెజారిటీతో నాలుగవ మారు గెలిచి రాజకీయంగా తనకు మరెవరూ సరిలేరని మరోసారి నిరూపించుకున్నారు. 1955 నుంచి కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న మంథని దేశానికి పీవీ నరసింహారావును అందించింది. 1952 నుండి నాలుగు మార్లు పీవీ నరసింహారావు ఇక్కడి నుండి ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టారు. 1983 నుండి 1994 వరకులో దుద్దిళ్ల శ్రీపాదరావు మూడుమార్లు ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర శాసనసభ స్పీకర్ గారు అత్యున్నత పదవిని అలంకరించారు. శ్రీపాదరావు వారసుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన శ్రీధర్ బాబు మంథనిలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి, కొణిజేటి రోశయ్య, కిరణ్కుమార్ రెడ్డి ప్రభుత్వాలలో మంత్రిగా రాష్ట్రంలో కీలకంగా పనిచేసారు. ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తగా, ప్రభుత్వ విప్పుగా, ఉన్నత విద్యాశాఖ మంత్రిగా, శాసనసభ వ్యవహారాలు, రాష్ట్ర విదేశాంగ, పౌరసరఫరాల శాఖ మంత్రిగా వివిధ పదవులను నిర్వహించారు.

శాసనసభలో తెలంగాణ రాష్ట్రాన్ని కోరుతూ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన అనంతరం మంత్రి పదవికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో తన పాత్ర పోషించారు. మంథని నియోజకవర్గంలో శ్రీధర్ బాబు గెలుపును అడ్డుకోవడానికి ప్రత్యర్ధులు అనేక రాజకీయ వ్యూహాలను పన్నారు. వామపక్ష భావజాల ప్రభావములో దశాబ్దాల కాలం ఉన్న ప్రజలలో బహుజన వాదాన్ని తెరపైకి తెచ్చి శ్రీధర్ బాబును నిలువరించే ప్రయత్నం చేశారు. స్వయంగా కేసీఆర్ మంథని ఎన్నికల ప్రచారములో బీసీ కార్డును ప్రయోగించి ప్రయత్నం చేశారు. మరోవైపు రాష్ట్రంలో బీసీ కార్డుతో ముందుకు సాగిన బిజెపి ఎలాంటి ప్రభావాన్ని చూపలేకపోయింది. దళిత ఓటర్లను పెద్ద ఎత్తున కలిగి ఉన్న కాంగ్రెస్ పార్టీ ఓట్లు మంథని నియోజకవర్గంలో చీలిపోవాలనే ప్రత్యర్థుల వ్యూహాలు శ్రీధర్ బాబు వ్యవహార దక్షత ముందు పనిచేయకుండా పోయాయి. ఎన్నికల ప్రచారంలో అభివృద్ధి, నేర రాజకీయాలు, సేవలు నియోజకవర్గంలో బిజెపి నాయకత్వం, బహుజన సమాజ్ వాది పార్టీ నాయకత్వం ఎన్నికల ప్రచారంలో శ్రీధర్ బాబు గెలుపును అంగీకరించక తప్పలేదు. 

వీరి వ్యూహం మంథని లో సాగిన నేరాలను, టిఆర్ఎస్ వైఫల్యాల కేంద్రీకరించి సాగింది. అన్ని వర్గాల ప్రజలను సమీకరించుకోవడంతో పాటు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఏకాకిని చేయడంతో పాటు బీసీ వాదాన్ని బహుజన వాదాన్ని శ్రీధర్ బాబు తనదైన శైలిలో సమర్థంగా ఎదుర్కొన్నారు. ఫలితంగా ఎన్నికలలో మంథని నియోజక వర్గ ప్రజలకు ఏకైక నాయకుడిగా తిరుగులేని తన నాయకత్వాన్ని ఖాయం చేసుకున్నారు. దీంతో భవిష్యత్తులో రాజకీయంగా శ్రీధర్ బాబుకు ఎదురు నిలిచి గెలువలేరనే స్థాయికి ఎదిగిపోయారు. శ్రీధర్ బాబు వ్యవహారంలో మంత్రిగా ఉన్నత పదవులు పొందిన సమయంలో క్రింది స్థాయి నాయకుల కేంద్రీకంగా ప్రదర్శించిన వైఖరిని విడనాడి ఓటమి తర్వాత సమస్యల కేంద్రంగా తన వైఖరిని పలుమార్లు స్పష్టం చేయడంతో ఈ మార్పును ప్రజలు ఆదరించడంతో పాటు ప్రజలకు సన్నిహితం కాగలిగారు. దీంతో క్రింది స్థాయి నాయకుల ఆగడాలు శ్రీధర్ బాబు వద్ద సాగయనే విశ్వాసం ప్రజలలో బలంగా ఏర్పడింది. తన వైఖరిలో అనేక మార్పులకు స్థానం కల్పించిన శ్రీధర్ బాబు  ముందు ప్రత్యర్ధుల ఎత్తుగడలు ఫలించలేదని తెలుస్తుంది.