తప్పులు లేకుండా వివరాలు నమోదు చేయాలి..

తప్పులు లేకుండా వివరాలు నమోదు చేయాలి..
  • నేటి నుంచి డేటా ఎంట్రీ ప్రక్రియ ప్రారంభించాలి..
  • ఈ నెల 17లోపు ప్రజాపాలన దరఖాస్తుల ఆన్ లైన్ ఎంట్రీ పూర్తి చేయాలి..
  • జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: ప్రజాపాలన దరఖాస్తుల వివరాలను తప్పులు లేకుండా ఆన్ లైన్ లో ఎంట్రీ చేయాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం ప్రజాపాలన దరఖాస్తులను ఆన్ లైన్ లో నమోదు చేసే అంశంపై డేటా ఎంట్రీ ఆపరేటర్లకు శుక్రవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా హాజరై మాట్లాడుతూ జిల్లాలో ప్రతిరోజు సుమారు 20వేల ప్రజాపాలన దరఖాస్తులు వస్తున్నాయని, జనవరి 6 వరకు 1లక్షా 40 వేల దరఖాస్తులు వస్తాయని, వాటిని ప్రభుత్వం రూపొందించిన ఆన్ లైన్ వెబ్ సైట్ లో నమోదు చేయాలని చెప్పారు. ప్రజా పాలన కార్యక్రమం ద్వారా వచ్చిన దరఖాస్తులను ఆన్ లైన్ లో నమోదు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక పోర్టల్ రూపొందించిందని, మండలాల వారీగా వచ్చిన దరఖాస్తులను డేటా ఎంట్రీ ఆపరేటర్ లు ఆన్ లైన్ ప్రజాపాలన వెబ్ సైట్ లో నమోదు చేయాలని తెలిపారు. ప్రభుత్వం పై నమ్మకంతో ప్రజలు ప్రజా పాలన కార్యక్రమానికి వచ్చి తమ దరఖాస్తులు సమర్పించారని, అర్హులైన ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందించేందుకు సదరు దరఖాస్తులను ఆన్ లైన్ లో నమోదు చేయడం చాలా కీలకమని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే దిశగా డేటా ఎంట్రీ ఆపరేటర్లు దరఖాస్తుదారుల వివరాలను ఎలాంటి చిన్న పొరపాటు కూడా లేకుండా ఆన్లైన్లో భద్రపరచాలని పేర్కొన్నారు.

ప్రజాపాలన వెబ్ సైట్  prajapalana.telangana.gov.in లో డేటా ఎంట్రీ ఆపరేటర్ లకు లాగిన్ అందిస్తామని, మండలాలలో అవసరమైన మేర కంప్యూటర్లు, వేగవంతమైన అంతర్జాలం ఏర్పాట్లు చేశామని, వెంటనే దరఖాస్తులు ఆన్లైన్ లో నమోదు చేయడం ప్రారంభించి, ప్రభుత్వం నిర్దేశించిన జనవరి 17 గడువులోగా మన జిల్లాకు వచ్చిన ప్రజా పాలన దరఖాస్తులను పూర్తిస్థాయిలో ఆన్లైన్లో నమోదు చేయాలని చెప్పారు. దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేసే సమయంలో దరఖాస్తుదారుల ఆధార్ కార్డు నెంబర్, రేషన్ కార్డు నెంబర్, వారి కుటుంబ సభ్యుల వివరాలు, వారు దరఖాస్తు చేసుకున్న పథకాలకు సంబంధించిన వివరాలు (గ్యాస్ కనెక్షన్ నెంబర్ పట్టాదార్ పాస్ పుస్తకం నెంబర్, విద్యుత్ మీటర్ నెంబర్,  ఉపాధి హామీ కార్డు నెంబర్, ఎఫ్ఐఆర్ నెంబర్ డెత్ సర్టిఫికెట్ నెంబర్, సదరం సర్టిఫికెట్ నెంబర్ మొదలగు) ఎలాంటి పొరపాట్లు లేకుండా నమోదు చేసి సమర్పించాలని ఆదేశించారు. ఆన్లైన్ లో నమోదు చేసే సమయంలో దరఖాస్తుదారుల వివరాలు అసంపూర్ణంగా ఉంటే  వెంటనే సంబంధిత ఎంపీడీవో లేదా తహసిల్దార్ కు సమాచారం అందించాలని, దరఖాస్తుదారుల నుంచి అసంపూర్ణంగా ఉన్న సమాచారం సేకరించి వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలని ఎట్టి పరిస్థితుల్లో దరఖాస్తులను తిరస్కరించడానికి వీలులేదని తెలిపారు. ఆన్లైన్లో నమోదు చేసే డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ప్రతి ప్రైవేట్ ఆపరేటర్ కు ఒక దరఖాస్తుకు 15 రూపాయలు, ప్రభుత్వ ఆపరేటర్ కు 5 రూపాయలు అందించడం జరుగుతుందని తెలిపారు. దరఖాస్తులలో పథకాల వారీగా వివరాలు నమోదు ప్రక్రియను వివరించారు. దరఖాస్తుల ఆన్లైన్ ఎంట్రీ ప్రక్రియ మధ్యాహ్నం నుంచి ప్రారంభించాలని ప్రతిరోజు నిర్దేశించుకున్న లక్ష్యం ప్రకారం వివరాలు ఎంటర్ ఇచ్చేసి సకాలంలో ప్రక్రియ పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

గోరికొత్తపల్లి నూతన మండలంగా ఏర్పడ్డ నేపథ్యంలో ఉద్యోగుల కొరత ఉన్నందున రేగొండలో కలుపడం జరిగిందని అన్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ వెంట పంచాయితీ సెక్రెటరీ, లేదా మరో ఉద్యోగి తప్పకుండా ఉండాలనీ, ఆపరేటర్ కు ఎన్ని అప్లికేషన్స్ ఇచ్చాం అన్నది తప్పకుండా రికార్డు మెయింటైన్ చేయాలనీ డాటా ఎంట్రీ పూర్తీ అయిన తరువాత దరకాస్తులను గ్రామ పంచాయితీలలో భద్రపరచాలనీ ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, మండల ప్రత్యేక అధికారులు, ఎం.పి.డి. ఓ లు , తహసిల్దార్ లు, పంచాయితీ సెక్రటరీ లు, డేటా  ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు.